టీకా తయారీలో భారత్‌ పాత్ర కీలకం

16 Sep, 2020 03:20 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ కారక కరోనా వైరస్‌ను కట్టడి చేసే టీకా తయారీలో భారత్‌ చాలా కీలకమైన పాత్ర పోషించనుందని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ వ్యాఖ్యానించారు. టీకా తయారు చేయడంతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటికీ దాన్ని చేరవేయడం కరోనా నియంత్రణలో ముఖ్యమైందని స్పష్టం చేశారు. బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా బిల్‌గేట్స్‌ కరోనా టీకా తయారీకి తనవంతు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం భారీ ఎత్తున టీకాలు తయారు చేయగల దేశాల్లో భారత్‌ ఒకటని, ఎవరికి? ఎన్ని టీకాలు అన్న ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉందని చెప్పారు.

అందరికీ న్యాయబద్ధంగా టీకా పంపిణీ అయ్యే విషయంలో భారత్‌ సాయం చేస్తుందని భావిస్తున్నామని, ధనికులకు ముందుగా టీకా అందించడం కాకుండా అత్యవసరమైన వారికి ఇవ్వడం ద్వారా ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని గేట్స్‌ వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా పేదరికం నిర్మూలనకు, వ్యాధులను ఎదుర్కొనేందుకు గేట్స్‌ ఇప్పటికే కోటానుకోట్ల డాలర్లు దానం చేసిన విషయం తెలిసిందే. కరోనా టీకా విషయంలోనూ గేట్స్‌ ఆ టీకాను తయారు చేస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌తో ఒక ఒప్పందం చేసుకున్నారు. వ్యాక్సీన్‌ తయారీ విషయంలో సీరమ్‌తోపాటు, బయలాజికల్‌ ఈ, భారత్‌ బయోటెక్‌ సంస్థల సామర్థ్యంపై మాట్లాడారు. టీకా ప్రయోగాల్లో కొన్ని సానుకూల ఫలితాలు వచ్చాయని, ప్రస్తుతం టీకాను ఎంత చౌకగా తయారు చేయవచ్చన్న అంశంపై దృష్టి పెట్టడం ముఖ్యమని చెప్పారు.

>
మరిన్ని వార్తలు