ఒమిక్రాన్‌ కలవరం.. తమిళనాడులో సబ్‌వేరియంట్‌ బీఏ.4 రెండో కేసు

21 May, 2022 14:16 IST|Sakshi

BA4 Variant India: కరోనా వైరస్‌ చిన్న గ్యాప్‌ ఇచ్చి మళ్లీ దడ పుట్టిస్తోంది. కొత్త రూపం దాల్చుకొని ప్రజలపై పంజా విసురుతోంది. ఇప్పుడిప్పుడే హమ్మయ్యా అనుకుంటున్న ప్రజలను బాబోయ్‌ అంటూ భయాందోళనకు గురిచేస్తోంది. భారత్‌లోనూ ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న ఒమిక్రాన్‌ బీఏ.4 తొలి కేసు హైదరాబాద్‌లో వెలుగు చూడగా.. తాజాగా తమిళనాడులో రెండో కేసు నమోదయ్యింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ ధృవీకరించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. చెంగళ్‌పట్టు జిల్లాలోని నవలూరుకు చెందిన వ్యక్తికి ఈ వైరస్‌ సోకినట్లు తెలిపారు.
సంబంధిత వార్త: హైదరాబాద్‌లో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లు

కాగా బీఏ4 వేరియంట్‌ మొట్టమొదటిసారిగా 2022 జనవరి 10న దక్షిణాఫ్రికాలో వెలుగుచూసింది. ఆ తర్వాత ఆఫ్రికా దేశాలన్నింటిలోనూ ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఇండియా సార్స్ కోవ్ 2 జీనోమిక్స్ కన్సార్షియం ఈ నెల 23న బులెటిన్ విడుదల చేయనుంది. అయితే ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ BA.4 లేదా BA.5 సోకిన వ్యక్తులకు కొత్త లక్షణాలు ఏవీ కనిపించడం లేదని వైద్యులు చెబుతున్నారు. అంతేగాక ఈ కొత్త వేరియంట్లు పెద్దగా ప్రమాదకరమైనవని కావని అభిప్రాయపడుతున్నారు.

ఇక  బీఏ.4 సబ్‌ వేరియంట్‌ హైదరాబాద్‌లో నమోదు అయిన విషయం తెలిసిందే. బీఏ.4 తొలికేసు వెలుగుచూసిన తర్వాత అతనితో కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని అధికారులు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌ వచ్చిన వ్యక్తి ఈ వేరియంట్‌ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వ్యక్తిలో లక్షణాలు ఏవీ లేవని వైద్యులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు