చైనా సరిహద్దు వెంబడి అదనపు బలగాల మోహరించిన భారత్‌

28 Jun, 2021 14:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వివరాలు వెల్లడించిన బ్లూంబర్గ్‌ నివేదిక

న్యూఢిల్లీ: గల్వాన్‌ ఘర్షణ అనంతరం భారత్‌-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో ఎన్నడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం చైనా సరిహద్దు వెంబడి సుమారు 50వేల అదనపు బలగాలను మోహరించినట్లు సమాచారం. బ్లూంబర్గ్‌ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత కొద్ది నెలలుగా చైనా సరిహద్దు వెంబడి మూడు ప్రాంతాలకు దళాలను, స్క్వాడ్రాన్‌ ఫైటర్‌ జెట్లను చేరవేసినట్లు తెలిపింది. గతేడాదితో పోల్చుకుంటే.. ఇండియా ఈ ఏడాది 40 శాతం అదనంగా అనగా 20 వేల దళాలలను సరిహద్దులో మోహరించినట్లు నివేదిక వెల్లడించింది. 

గతేడాది తూర్పు లద్ధాఖ్‌లో నెలకొన్న ఘర్షణల తర్వాత కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌ లోయ నుంచి అత్యుత్తన్న శిఖర ప్రాంతాలకు సైనికులను చేరవేయడం కోసం ఎక్కువ సంఖ్యలో హెలికాప్టర్లతో పాటు ఎం777 హోయిట్జ‌ర్ వంటి అత్యాధునిక ఆయుధాల‌ను త‌ర‌లించింద‌ని బ్లూమ్‌బ‌ర్గ్‌ నివేదిక పేర్కొంది. ఇక భారత సరిహద్దు సమీపంలో చైనా ఇప్పటివరకు ఎన్ని దళాలను మోహరించిందో స్పష్టంగా తెలియదు. కానీ హిమాలయాల వెంబడి వివాదాస్పద ప్రాంతాలలో పెట్రోలింగ్ బాధ్యత వహించే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల టిబెట్ నుంచి జిన్జియాంగ్ మిలిటరీ కమాండ్‌కు అదనపు బలగాలను తరలించినట్లు తెలిసింది.

చదవండి: శాంతి బోధకులమే కానీ, మా జోలికొస్తే ఊరుకోం..

మరిన్ని వార్తలు