అక్టోబర్‌లో కరోనా థర్డ్‌ వేవ్‌?

19 Jun, 2021 05:20 IST|Sakshi

ఈసారి భారత్‌ సమర్థంగా ఎదుర్కోగలదు

రాయిటర్స్‌ సంస్థ అంచనాలు  

న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌–19 థర్డ్‌ వేవ్‌ అక్టోబర్‌లో వస్తుందని, అయితే సెకండ్‌ వేవ్‌ కంటే సమర్థంగా మన దేశం ఎదుర్కొంటుందని రాయిటర్స్‌ సంస్థ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 40 మంది వైద్య రంగ నిపుణులు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, ఎపిడమాలజిస్టులు, ప్రొఫెసర్లు... ఇలా కరోనాపై పని చేస్తున్న నిపుణుల అభిప్రాయాలను సేకరించింది. మొదటి రెండు వేవ్‌లు ఎలా మొదలై, ఎలా కేసులు పెరిగి, తిరిగి ఎలా తగ్గాయో తెలిపే డేటాను సేకరించింది. అన్నింటినీ క్రోడీకరించి కొన్ని అంచనాలు తయారు చేసింది. భారత్‌లో అక్టోబర్‌లో థర్డ్‌ వేవ్‌ ఖాయంగా వస్తుందని చెప్పిన రాయిటర్స్‌ కేంద్రంలో మోదీ సర్కార్‌ సెకండ్‌ వేవ్‌ కంటే దీనిని సమర్థంగా ఎదుర్కొంటుందని తెలిపింది. మరో ఏడాది పాటు కరోనా ప్రజారోగ్యానికి సవాల్‌గానే ఉంటుందని పేర్కొంది.

జూన్‌ 3–17 మధ్య 40 మంది నిపుణుల అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 85% మందికి పైగా అక్టోబర్‌లో థర్డ్‌ వేవ్‌ వస్తుందని చెప్పారు. ముగ్గురు శాస్త్రవేత్తలు ఆగస్టులో వస్తుందని లెక్కలు వేస్తే, 12 మంది సెప్టెంబర్‌లో వస్తుందన్నారు. ఇక మిగిలిన వారు నవంబర్, వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్య కోవిడ్‌ మళ్లీ పంజా విసురుతుందని వివరించారు. 70% మంది నిపుణులు భారత్‌  మూడో వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొంటుందని చెప్పారు ‘‘థర్డ్‌ వేవ్‌ని మరింత సమర్థంగా ఎదుర్కోగలం. ఎందుకంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ ఇస్తున్నాం. అంతే కాకుండా సెకండ్‌ వేవ్‌లో అత్యధికంగా కేసులు నమోదు కావడంతో ఎంతో కొంత హెర్డ్‌ ఇమ్యూనిటీ ఏర్పడే ఉంటుంది’’అని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గులేరియా చెప్పారు.

పిల్లలకి ముప్పు ఉండే ఛాన్స్‌  
ఈసారి పిల్లలపై థర్డ్‌ వేవ్‌ ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై 40 మంది నిపుణుల్లో 26 మంది ముప్పు పొంచి ఉందని చెబితే, 14 మంది అలాంటిదేమీ ఉండదన్నారు. మరో ఏడాది పాటు కరోనాతో ప్రజలు సహజీవనం చేయాల్సి ఉంటుందని రాయిటర్స్‌ సంస్థ నివేదిక తెలిపింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు