కరోనా టీకాల పరస్పర గుర్తింపు.. 11 దేశాలతో భారత్‌ ఒప్పందాలు

21 Oct, 2021 12:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సిన్లను పరస్పరం గుర్తించే విషయంలో 11 దేశాలతో భారత్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆమోదించిన వ్యాక్సిన్లు ఇందులో ఉన్నాయని తెలిపింది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, నేపాల్, బెలారస్, లెబనాన్, ఆర్మేనియా, ఉక్రెయిన్, బెల్జియం, హంగెరీ, సెర్బియా దేశాలతో భారత్‌ ఈ ఒప్పందాలు కుదుర్చుకుందని పేర్కొంది.

ఆయా దేశాల్లో పూర్తిగా వ్యాక్సినేట్‌ అయిన పర్యాటకులు భారత్‌కు వచ్చిన తర్వాత హోంక్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని, మళ్లీ కరోనా టెస్టు చేయించుకోవాల్సిన పని లేదని వివరించింది. కానీ, వారు ఆర్‌టీ–పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. 

కోవిడ్‌ విధుల్లో మృతులకు బీమా ఆర్నెల్లు పొడిగింపు 
న్యూఢిల్లీ: కోవిడ్‌ చికిత్స విధుల్లో పాల్గొంటూ వ్యాధిబారిన పడి ప్రాణాలు కోల్పోయిన వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందికి ప్రస్తుతం అందిస్తున్న రూ.50 లక్షల బీమా కవరేజిని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించింది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజ్‌ కింద కల్పించిన ఈ బీమా సౌకర్యం అక్టోబరు 20 (బుధవారం)తో ముగిసింది. కోవిడ్‌తో మన పోరాటం ఇంకా కొనసాగుతుండటం, వైద్య సిబ్బంది మరణాలు ఇంకా సంభవిస్తున్నట్లు రాష్ట్రాల నుంచి వస్తున్న సమాచారం మేరకు మృతుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడటానికి రూ.50 లక్షల బీమా రక్షణను మరో అరు నెలలు పొడిగిస్తున్నామని కేంద్రం తెలిపింది. (పరీక్షా కేంద్రం నగరాన్ని మార్చుకునేందుకు ఓకే: సీబీఎస్‌ఈ)

మరిన్ని వార్తలు