Agni-Prime: భారత దేశ సరికొత్త ఆయుధం ఇదే!

30 Jun, 2021 01:35 IST|Sakshi

అగ్ని–ప్రైమ్‌ విశేషాలు...

రోడ్డుపై, రైలు మార్గంలోనూ అవసరమైన ప్రాంతానికి తరలించవచ్చు.

అగ్ని–3 బరువులో సగం మాత్రమే ఉంటుంది.

అవసరమైన చోటి నుంచి గొట్టంలాంటి నిర్మాణముండే క్యానిస్టర్‌ నుంచి ప్రయోగించవచ్చు.

‘‘పిట్ట కొంచెం.. కూత ఘనం’’
ఒడిశా తీరంలోని అబ్దుల్‌ కలామ్‌ 
ద్వీపంలో సోమవారం...

నిప్పులు చిమ్ముకుంటూ పైకెగసిన క్షిపణి ‘‘అగ్ని–ప్రైమ్‌’’...
ఈ సామెతకు ప్రత్యక్ష ఉదాహరణ.
చిన్న సైజులో ఉండటం 
మాత్రమే దీని విశేషం కాదు...

అత్యాధునిక టెక్నాలజీలు నింపుకుని...
తొలి అగ్ని క్షిపణికి రెట్టింపు దూరపు లక్ష్యాలనూ తుత్తునియలు చేయగలదు!!
భారత రక్షణ తూణీరపు 
సరికొత్త ఆయుధం కూడా ఇదే!! 

భారతదేశం తనకంటూ సొంతంగా క్షిపణులు ఉండాలని 1980లలోనే భావించి ఇంటిగ్రేటెడ్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. మాజీ రాష్ట్రపతి, భారత రత్న ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ నేతృత్వంలో మొదలైన ఈ కార్యక్రమం తొలి ఫలం ‘‘అగ్ని’’. సుమారు 900 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి తరువాత దశల వారీగా మరిన్ని అగ్ని శ్రేణి క్షిపణుల తయారీ జరిగింది. అయితే, ఆ కాలం నాటి టెక్నాలజీలతో పనిచేసే క్షిపణులను ఈ 21వ శతాబ్దానికి అనుగుణంగా మార్చుకోవాలని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ఐదేళ్ల క్రితం చెప్పుకున్న సంకల్పానికి అనుగుణంగానే సరికొత్త అగ్ని–ప్రైమ్‌ సిద్ధమైంది. ఇరుగుపొరుగు దేశాలతో ముప్పు ఏటికేడు పెరిగిపోతున్న నేపథ్యంలో అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లగల అగ్ని–ప్రైమ్‌ మన అమ్ముల పొదిలోకి చేరడం విశేషం. తొలి తరం అగ్ని పరిధి 1,000 కిలోమీటర్ల లోపు కాగా.. అగ్ని–ప్రైమ్‌ సుమారు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా అత్యంత కచ్చితత్వంతో మట్టుబెట్టగలదు. ఇంకోలా చెప్పాలంటే తొలి తరం అగ్ని క్షిపణి పాకిస్తాన్‌ను దృష్టిలో ఉంచుకుని తయారైతే.. అగ్ని–ప్రైమ్‌ కొత్త శత్రువు కోసం సిద్ధం చేశారని అనుకోవచ్చు. ఎందుకంటే.. 2,000 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటే.. చైనా మధ్యలో ఉండే లక్ష్యాన్ని కూడా ఢీకొట్టవచ్చు. 

కొంగొత్త టెక్నాలజీలు...
అగ్ని శ్రేణి క్షిపణుల ఆధునీకరణకు 2016లోనే బీజం పడింది. ఇందులో భాగంగా సిద్ధమైన అగ్ని–ప్రైమ్‌లో అగ్ని–4, అగ్ని–5 క్షిపణుల్లో వాడిన టెక్నాలజీలను ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఈ స్థాయి క్షిపణుల్లో ఈ టెక్నాలజీల వాడకం ప్రపంచంలో మరెక్కడా జరగలేదని డీఆర్‌డీవో శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. రెండు దశల అగ్ని–ప్రైమ్‌లో పూర్తిస్థాయిలో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దాదాపు వెయ్యి కిలోల అణ్వస్త్రాలను సులువుగా మోసుకెళ్లగలదు. రెండు దశల్లోనూ మిశ్రధాతువులతో తయారైన రాకెట్‌ మోటార్లను ఉపయోగిస్తున్నారు. క్షిపణిని లక్ష్యం వైపునకు తీసుకెళ్లే గైడెన్స్‌ వ్యవస్థలో ప్రత్యేకమైన ఎలక్ట్రో మెకానికల్‌ ఆక్చుయేటర్స్‌ వినియోగించారు. కచ్చితత్వాన్ని సాధించేందుకు అత్యాధునిక రింగ్‌ లేజర్‌ జైరోస్కోపులు ఉంటాయి దీంట్లో. ఉక్కుతో చేసిన మోటార్ల స్థానంలో మిశ్రధాతువులను వాడటం ద్వారా సైజు, బరువు తగ్గడం, మరింత ఎక్కువ దూరం ప్రయాణించడం సాధ్యమైంది. ఎలక్ట్రో మెకానికల్‌ ఆక్చుయేటర్స్‌ కారణంగా గతంలో మాదిరిగా క్షిపణుల్లో లీకేజీల్లాంటివి ఉండవు. నావిగేషన్‌ వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా లక్ష్యాన్ని ఢీకొట్టే అవకాశాలు పెరుగుతాయి. గతంలో మాదిరిగా వేర్వేరు వైమానిక వ్యవస్థల స్థానంలో పవర్‌ పీసీ ప్లాట్‌ఫార్మ్‌పై ఒకే ఒక్క వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా క్షిపణిని మరింత శక్తిమంతంగా మార్చడం సాధ్యమైంది. ఈ టెక్నాలజీలన్నింటినీ 2011లో అభివృద్ధి చేసిన అగ్ని–4లో ప్రయోగాత్మకంగా పరిశీలించి చూసినవే.

అగ్ని–2....
2004లో అందుబాటు లోకి వచ్చింది. మధ్య శ్రేణి క్షిపణి. 20 మీటర్ల పొడవు, 2.3 మీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రయోగించే సమయంలో దీని బరువు 16 వేల కిలోలు. వెయ్యి కిలోల అణ్వస్త్రాన్ని క్షిపణిని మోసుకెళ్లగలదు. దీని పేలుడు హిరోషిమా, నాగసాకీ అణు బాంబుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అని అంచనా. లక్ష్యాన్ని కేవలం 40 మీటర్ల తేడాలో ఢీకొట్టగలదు. పేలుడు పదార్థం బరువును తగ్గిస్తే ఈ క్షిపణి పరిధిని మరింతగా పెంచవచ్చు. 

అగ్ని –3...
మూడు వేల నుంచి ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు అభివృద్ధి చేసిన క్షిపణి ఇది. బీజింగ్, షాంఘైలనూ ఢీకొట్టగలదు. దాదాపు 16.7 మీటర్ల పొడవు, 1.85 మీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రయోగించే సమయంలో బరువు 48,000 కిలోలు. రెండు వేల కిలోల బరువున్న అణ్వాస్త్రాన్ని మోసుకెళ్లగలదు. కొన్నింటిలో ఒకే రాకెట్‌ ద్వారా వేర్వేరు లక్ష్యాలను ఢీకొట్టగల మల్టిపుల్‌ టార్గెటబుల్‌ రీ ఎంట్రీ వెహికల్స్‌ టెక్నాలజీని అమర్చుకోవచ్చు. ఈ టెక్నాలజీతో ఒకే రాకెట్‌ను ఉపయోగించి వేర్వేరు లక్ష్యాలను ఢీకొట్టవచ్చు నన్నమాట. 2011 నుంచి దేశసేవకు అందుబాటులో ఉంది.

అగ్ని–4...
నుంచి అందుబాటులో ఉన్న అగ్ని–4 పరిధి 3,500– 4,000 కిలోమీటర్లు. ఇరవై నుంచి 45 కిలోటన్నుల పేలుడు సామర్థ్యమున్న ఫిషన్‌ అణ్వాయుధాన్ని, 200– 300 కిలోటన్నుల సామర్థ్యం ఉన్న ఫ్యూజన్‌ బాంబును మోసుకెళ్లగలదు. ఇరవై మీటర్ల పొడవుండే రెండు దశల ఘన ఇంధనపు క్షిపణి ప్రయోగ సమయంలో 17,000 కిలోల బరువు ఉంటుంది. 

అగ్ని – 5 
2018 డిసెంబర్‌లో విజయవంతంగా ఏడో పరీక్ష ముగించుకున్న అగ్ని –5 క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా పది మీటర్ల తేడాతో ఢీకొట్టగలదు. దీని పరిధి అనధికారికంగా 8 వేల కిలోమీటర్లపై మాటే అని అంచనా. వేర్వేరు లక్ష్యాలను ఛేదించేందుకు ఎంఆర్‌ఐవీ టెక్నాలజీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు దీంట్లో. అవసరాన్ని బట్టి రెండు నుంచి పది వేర్వేరు లక్ష్యాలను ఢీకొట్టేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. దాదాపు 1,500 కిలోల బరువున్న పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. 
 – సాక్షి, హైదరాబాద్‌.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు