వీఎల్‌–ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎం పరీక్ష సక్సెస్‌

25 Jun, 2022 05:43 IST|Sakshi

బాలసోర్‌: ఒడిశా తీరం చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌(ఐటీఆర్‌) నుంచి శుక్రవారం చేపట్టిన వెర్టికల్‌ లాంచ్‌ షార్ట్‌ రేంజ్‌ క్షిపణి (వీఎల్‌–ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎం) ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. నేవీ షిప్‌ నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి నిర్దేశించిన పరిమితుల ప్రకారం ఛేదించిందని అధికారులు తెలిపారు. ఈ ఆయుధ వ్యవస్థ అత్యంత సమీపంలోని వివిధ రకాల లక్ష్యాలను అడ్డుకుంటుందని, రాడార్‌ తదితరాలకు దొరక్కుండా తప్పించుకునే వాటిని కూడా ఎదుర్కొంటుందని వెల్లడించారు. ఈ క్షిపణి హై స్పీడ్‌ ఏరియల్‌ టార్గెట్‌ను ఛేదించడాన్ని అంచనా వేసేందుకు పలు ట్రాకింగ్‌ వ్యవస్థలను వినియోగించినట్లు చెప్పారు.

ఈ ప్రయోగం డీఆర్‌డీవో, నేవీ ఉన్నతాధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిందన్నారు. పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన డీఆర్‌డీవో, నేవీలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు. ఈ విజయంతో భారత నావికాదళం గగనతలం నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనే సామర్థ్యం మరింత పెరుగుతుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ నేవీ, డీఆర్‌డీవో బృందాల కృషిని ప్రశంసించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న బృందాలను డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీశ్‌ రెడ్డి అభినందించారు. భారత నావికా దళం సామర్థ్యాన్ని ఈ ఆయుధ వ్యవస్థ ఇనుమడింప జేస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన ‘‘ఆత్మనిర్భర్‌ భారత్‌’’లో ఇది మరో మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు