టెకీల‌కు గుడ్ న్యూస్.. భారీగా నియామ‌కాలు!

19 Apr, 2021 19:24 IST|Sakshi

కరోనా మహమ్మారి కారణంగా డిజిటల్ సేవలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చాలా కంపెనీలు తమ వినియోగదారులకు డిజిటల్ రూపంలో దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది నైపుణ్యాల‌కు డిమాండ్ పెర‌గ‌డంతో దేశీయ ఐటి దిగ్గ‌జాలు ల‌క్ష‌కు పైగా టెకీల‌ను నియ‌మించుకునేందుకు సన్నదమవుతున్నాయి. దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ ఈ ఏడాది క్యాంప‌స్ నుంచి 40,000 మందిని నియమించుకునేందుకు యోచిస్తోంది. అలాగే ఈ నియాయమకాలతో దేశంలో 5 లక్షలకు పైగా ఉద్యోగులు గల ఏకైక సంస్థగా టీసీఎస్ అవతరించనుంది.

అలాగే, ఇన్ఫోసిస్ కూడా క్యాంప‌స్ ల నుంచి 25,000 మందిని నియమించుకోవాలని భావిస్తుంది. మరో దేశీ ఐటీ దిగ్గ‌జం విప్రో గ‌త ఏడాది కంటే అధికంగా నియామ‌కాలు చేప‌డ‌తామ‌ని వెల్ల‌డించింది. డిమాండ్ పెరగడంతో పాటు టెక్ నైపుణ్యాల‌ గల వ్యక్తులకు భారీగా గిరాకీ పెరిగింద‌ని ఇన్ఫోసిస్ సీఓఓ ప్ర‌వీణ్ రావు ఇటీవ‌ల విశ్లేష‌కుల‌తో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, టెక్ మ‌హీంద్ర కంపెనీలు అన్నీ కలిసి 1,10,000కు పైగా నియామ‌కాలు చేపట్టనున్నట్లు స్టాఫింగ్ ఏజెన్సీ ఎక్స్ ఫెనో స‌హ వ్య‌వ‌స్ధాప‌కుడు క‌మ‌ల్ క‌రంత్ పేర్కొన్నారు. మ‌రోవైపు కంపెనీలు ఐటీ వ్య‌యాల‌ను పెంచడం, ఆర్థిక కార్య‌క‌లాపాలు పుంజుకోవ‌డంతో భారీ నియామ‌కాలకు ఐటీ కంపెనీలు మొగ్గుచూపుతాయ‌ని క‌మ‌ల్ క‌రంత్ పేర్కొన్నారు.

చదవండి: 

సరికొత్త రికార్డుకు చేరువలో టీసీఎస్

మరిన్ని వార్తలు