సోషల్‌ మీడియా సంస్థలకు వార్నింగ్!

12 Feb, 2021 06:13 IST|Sakshi

స్వేచ్ఛ ఉన్నా చట్టపరంగా నడవాలి

లేదంటే కఠిన చర్యలు తప్పవు 

సామాజిక మాధ్యమాలకు రవిశంకర్‌ ప్రసాద్‌ హెచ్చరిక

న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు నిరసనలపై ట్విటర్‌లో తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్న వారి అకౌంట్లు బ్లాకింగ్‌ వివాదాస్పదమైన నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సామాజిక మాధ్యమాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. వ్యాపారం చేయడానికి వచ్చిన వారు ఎఫ్‌డీఐలు తెచ్చి, భారత చట్టాలను గౌరవించాలని చెప్పారు. ట్విట్టర్‌లో విద్వేషపూరిత ట్వీట్లు పెడుతున్న వారందరి ఖాతాలను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించినప్పటికీ ఆ సంస్థ సంపూర్ణంగా ఆ పని నిర్వహించకపోవడంతో రవిశంకర్‌ సోషల్‌ మీడియా సంస్థలకు వార్నింగ్‌ ఇచ్చారు.

గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ అమెరికాలోని క్యాపిటల్‌ భవనంపై దాడి సమయంలో ఒక రకంగా, ఎర్రకోటపై దాడి ఘటనలో మరో రకంగా ఎలా స్పందిస్తారని ట్విట్టర్‌ను సూటిగా ప్రశ్నించారు. క్యాపిటల్‌ భవనంపై దాడి జరిగిన సమయంలో పోలీసులకు అండగా ఉండి విద్వేషాన్ని వెళ్లగక్కేవారి ఖాతాలను సస్పెండ్‌ చేసిన సామాజిక మాధ్యమాలు ఎర్రకోట ఘటన సమయంలో అదే తరహాలో ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు తమ దగ్గర కుదరవని అన్నారు. ‘తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దు. మీరు ఇక్కడ వ్యాపారం కోసం వచ్చారు. అదే చేసుకోండి. చట్టాలకు కట్టుబడి వ్యవహరించండి. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాం’అని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు