చైతన్య భారతి: వైద్య ఉద్యమకారిణి కాదంబిని గంగూలీ

4 Aug, 2022 13:58 IST|Sakshi

1861–1923

కాదంబిని వైద్యురాలిగా అవతరించిన కాలాన్ని చూస్తే ఆమె విజయం ఎంత చరిత్రాత్మకమో అర్థం అవుతుంది. ఆమె పుట్టిన సంవత్సరం 1861. ఆ సంవత్సరమే భారతదేశంలో సతీ దురాచారాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ విక్టోరియా రాణి ప్రకటన జారీ చేశారు! 1803లో ఒక్క కలకత్తాలోనే కేవలం 30 మైళ్ల పరిధిలో 438 సతీసహగమనాలు జరిగాయి. ఇలాంటి నేపథ్యం ఉన్న నేల మీద పుట్టిన కాందబిని గైనకాలజిస్ట్‌ అయ్యారు.

కానీ ఆ రోజుల్లో వైద్య విద్య చదివిన మహిళా డాక్టరు అన్నా మంత్రసాని కంటే ఎక్కువ విలువ ఇచ్చేది కాదు సమాజం. కాదంబిని గంగూలీ అసలు పేరు కాదంబిని బసు. భారతదేశం నుంచి పట్టభద్రులైన తొలి ఇద్దరు మహిళల్లో ఒకరు. ఆ రెండో మహిళ డెహ్రాడూన్‌ కు చెందిన చంద్రముఖి బసు. కాదంబిని  వైద్యురాలిగా ఎంతో ప్రతిభను కనపరచడమే కాకుండా, భారత జాతీయ కాంగ్రెస్‌ ఉద్యమంలో, మహిళల హక్కుల సాధన ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు.

కాదంబిని బిహార్‌లోని భాగల్పూరులో పుట్టారు. ఆమె కుటుంబం బ్రహ్మ సమాజ దీక్షను స్వీకరించింది. ఇండియాలో విద్యాభ్యాసం అయ్యాక 1892లో  కాదంబిని లండన్‌ వెళ్లారు. విదేశాలలో వైద్య పట్టాపుచ్చుకుని వచ్చి, ఆ వృత్తి నిర్వహించిన తొలి ఆసియా మహిళగా కాదంబిని చరిత్ర ప్రసిద్ధురాలయ్యారు. నేపాల్‌ రాజమాతను దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యను పరిష్కరించడంతో ఉన్నత వర్గాలలో ఆమె పేరు మారుమోగిపోయింది.

కాదంబిని ద్వారకానాథ్‌ గంగూలీని వివాహం చేసుకున్నారు. ఆయన కూడా బ్రహ్మ సమాజీకుడే. ఆయన ప్రోత్సాహంతోనే కాదంబిని విదేశాలకు వెళ్లి చదువు పూర్తి చేశారు. కాదంబిని గొప్ప వైద్యురాలు. గొప్ప సామాజిక కార్యకర్త. మేధావి. వీటితో పాటు గొప్ప తల్లి. ఆమె తన భర్త ముందు భార్యకు జన్మించిన ముగ్గురు పిల్లలతో పాటు, తామిద్దరికీ జన్మించిన మరో ఐదుగురు పిల్లలను కూడా పెంచారు.

భర్తకు, ఆమెకు పదిహేడు సంవత్సరాల తేడా ఉంది.ఆమె పలు సామాజిక ఉద్యమాలతో పాటు కాంగ్రెస్‌ జాతీయోద్యమంలో కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్‌ సభలలో వేదిక మీద కనిపించిన తొలి మహిళ కూడా కాదంబినియే. ఆమె బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమంలో కూడా పాల్గొన్నారు. 1908లో కలకత్తాలోనే మహిళా సమావేశం నిర్వహించారు. తూర్పు భారతంలో గనులలో పనిచేసే మహిళల హక్కుల కోసం పోరాటం చేశారు. దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం గాంధీజీ స్థాపించిన ట్రాన్స్‌వాల్‌ ఇండియన్‌ అసోసియేషన్‌  అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 1923లో మరణించే వరకు ఆమె వైద్య వృత్తిని వీడలేదు.

మరిన్ని వార్తలు