స్వతంత్ర భారతి: షా బానో కేసు

9 Jul, 2022 14:09 IST|Sakshi

1985/2022

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 62 ఏళ్ల ఒక సాధారణ ముస్లిం మహిళ పేరు ఉన్నట్లుండి దేశమంతా మార్మోగిపోయింది. అంతేకాదు,  అప్పటి ప్రభుత్వానికి ఆమె ఓ రాజకీయ సాధనంగా మారారు. ఇంతకీ ఆమె చేసిందల్లా తన ఐదుగురు పిల్లలను పోషించుకోడానికి విడిపోయిన భర్త నుంచి మనోవర్తి కోరడమే. దీని కోసం షా బానో  దాఖలు చేసిన కేసు చివరికి సుప్రీంకోర్టుకు చేరింది. షా బానోకు 1978లో భర్త విడాకులిచ్చాడు. ముస్లిం పర్సనల్‌ లా కింద ఆమెకు కేవలం మెహర్, మూడు నెలల మనోవర్తి లభిస్తాయి. మెహర్‌ మొత్తాన్ని వివాహ సమయంలో నిర్దేశిస్తారు.

కాగా, 1985 తీర్పులో సుప్రీంకోర్టు.. విడాకులు తీసుకున్న మహిళ తనను తాను పోషించుకోగల స్థోమత సంపాదించుకునేంత వరకు భర్త ఆమెకు మనోవర్తి చెల్లించాల్సిందేనని ఉద్ఘాటిం చింది. కానీ, అప్పట్లో ముస్లింలలోని ఒక వర్గం ఒత్తిడికి తల వంచి రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం 1986లో ముస్లిం మహిళల (విడాకుల హక్కుల రక్షణ) చట్టాన్ని తెచ్చింది. ఇది మహిళల వ్యక్తిగత హక్కులకు, మైనారిటీ వర్గ హక్కులకు మధ్య సంఘర్షణను సృష్టించింది.

ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు
– టెర్రరిస్ట్‌ అండ్‌ డిజ్రప్టివ్‌ యాక్టివిటీస్‌ (ప్రివెన్షన్‌) యాక్ట్‌ రాష్ట్రపతి అనుమతితో అమలులోకి వచ్చింది. ఇదే ‘టాడా’ యాక్ట్‌.
– భారత పార్లమెంటు ద్వారా ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఏర్పాటైంది. ఇదే ‘ఇగ్నో’.
– పార్లమెంటు ఆమోదం తెలుపడంతో ‘నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రాపిక్‌ సబ్‌స్టెన్సెస్‌’ యాక్ట్‌ అమలులోకి వచ్చింది. 

మరిన్ని వార్తలు