Military Farms: మిలటరీ మిల్క్‌ ఫామ్స్‌ మూసివేత

1 Apr, 2021 13:58 IST|Sakshi

న్యూఢిల్లీ: సైనిక యూనిట్లకు పాలు సరఫరా చేసేందుకు బ్రిటిష్‌ పాలకులు ఏర్పాటు చేసిన మిలటరీ ఫామ్స్‌ కాలగర్భంలో కలిసిపోయాయి. సైనిక సంస్కరణలలో భాగంగా వీటిని మూసివేసినట్లు భారత సైన్యం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 132 ఏళ్లుగా సేవలందిస్తూ వచ్చిన పాల ఉత్పత్తి కేంద్రాలు మూతపడ్డాయి.

దేశవ్యాప్తంగా పలు కంటోన్మెంట్లలో మిలటరీ ఫామ్స్‌ ఉన్నాయి. వీటిలో 25 వేల ఆవులు/గేదెలు ఉన్నట్లు అంచనా. ఇవి నిత్యం వేలాది లీటర్ల పాలు ఇచ్చేవి. భారత్‌లో మొదటి మిలటరీ ఫామ్‌ 1889 ఫిబ్రవరి 1న అలహాబాద్‌లో ప్రారంభమయ్యింది. స్వాతంత్య్రం వచ్చే నాటికి 130 ఫామ్‌లు, 30 వేల ఆవులు/గేదెలు ఉన్నాయి. 20 వేల ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేశారు.

మిల్క్‌ ఫామ్స్‌ నిర్వహణ కోసం సైన్యం ప్రతిఏటా రూ.300 కోట్లు ఖర్చు చేసేది. ఫామ్స్‌ను మూసివేయడంతో వీటిలో ఉన్న ఆవులు, గేదెలను ప్రభుత్వ విభాగాలకు, డెయిరీ సహకార సంఘాలకు తక్కువ ధరకే ఇవ్వాలని నిర్ణయించారు.   

ఇక్కడ చదవండి:
కేంద్రం యూటర్న్‌ : ఏప్రిల్‌ ఫూల్‌ జోకా?

సుప్రీంకోర్టుకు ‘సాగు చట్టాల’పై నివేదిక

మరిన్ని వార్తలు