లద్దాఖ్‌లో ‘వజ్ర’ రెజిమెంట్‌

3 Oct, 2021 04:06 IST|Sakshi

50 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా

చైనా చర్యలతో అప్రమత్తమైన భారత్‌

న్యూఢిల్లీ: చైనా కవ్వింపు చర్యలతో భారత్‌ అప్రమత్తమైంది. వాస్తవా«దీన రేఖ వెంబడి డ్రాగన్‌ దేశం భారీగా సైన్యాన్ని ఆయుధ సంపత్తిని మోహరిస్తుండగా దీటుగా ప్రతిచర్యలు ప్రారంభించింది. లద్దాఖ్‌ సెక్టార్‌లోని ఫార్వర్డ్‌ ప్రాంతాల్లో మొట్టమొదటి కె–9 వజ్ర శతఘ్నులతో కూడిన బలగాలను తరలించింది. ఈ సెల్ఫ్‌ ప్రొపెల్డ్‌ శతఘ్నులకు 50 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఛేదించే శక్తి ఉంది.

‘పర్వతప్రాంతాల్లోనూ కె–9 వజ్ర విజయవంతంగా పనిచేస్తున్నట్లు ప్రయోగ పరీక్షల్లో రుజువైంది. ఇటీవలే ఉత్పత్తయిన ఈ హొవిట్జర్ల మొత్తం రెజిమెంట్‌ను ఇక్కడ మోహరించాం. ఇవి చాలా సహాయకారిగా ఉంటాయి’అని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ తెలిపారని ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ‘చైనా వైపు పరిణామాలను నిత్యం కనిపెట్టి చూస్తున్నాం. తూర్పులద్దాఖ్‌తోపాటు, మన తూర్పు కమాండ్‌ పరిధిలో చైనా గణనీయంగా బలగాలను మోహరించింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. ఈ పరిస్థితుల్లో ఎలాంటి దుందుడుకు చర్యనైనా తిప్పికొట్టేందుకు ఉపక్రమించాం.

ఆర్మీ, ఆయుధ సంపత్తి మోహరింపుతోపాటు మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచాం’అని ఆర్మీ చీఫ్‌ వెల్లడించారు. కాగా, దక్షిణకొరియా తయారీ కె–9 థండర్‌కు దేశీయంగా అభివృద్ధి చేసిన రూపమే కె–9 వజ్ర. ఈ శతఘ్నులను ముంబైకి చెందిన లార్సెన్‌ అండ్‌ టూబ్రో సంస్థ దక్షిణకొరియా సంస్థ భాగస్వామ్యంతో ఉత్పత్తి చేస్తోంది. భారత్‌–చైనాల మధ్య వాస్తవా«దీన రేఖ వెంబడి 3,488 కిలోమీటర్ల మేర వివాదం నడుస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌ కూడా తనదేననీ, అది దక్షిణ టిబెట్‌లోని భాగమేనని చైనా వాదిస్తుండగా భారత్‌ ఖండిస్తోంది. గత ఏడాది పాంగాంగో సరస్సు ప్రాంతంలో జరిగిన తీవ్ర ఘర్షణల అనంతరం సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రెండు వైపులా వేలాదిగా బలగాలను సరిహద్దుల్లోకి తరలించాయి. 

మరిన్ని వార్తలు