సైన్యం శీతాకాలం కోసం..

16 Sep, 2020 03:15 IST|Sakshi
లద్దాఖ్‌లోని సైనిక స్థావరానికి నిత్యావసరాలు తీసుకొచ్చిన సీ17 రవాణా విమానం

లేహ్‌:  త్వరలో ప్రారంభం కానున్న సుదీర్ఘ శీతాకాలంలో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా భారత సైన్యం సిద్ధమవుతోంది. చైనాతో సరిహద్దు వివాదాలు పెరిగిపోతున్న సమయాన లద్దాఖ్‌ ప్రాంతంలో సదా సంసిద్ధంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. శీతాకాలంలో లద్దాఖ్‌ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు చేరుకుంటాయి. నెలలపాటు లడఖ్‌కు దేశంలోని ఇతర ప్రాంతాలతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంటుంది. ఈ నేపథ్యంలో ఆర్మీకి అవసరమైన అన్ని వస్తువులను ఫార్వార్డ్‌ పోస్టుల వద్దకు చేరుస్తున్నట్లు మేజర్‌ జనరల్‌ అరవింద్‌ కపూర్‌ చెప్పారు.

చలికాలం గడిపేందుకు కావాల్సిన సరుకులు, ఇంధనం, ఆయుధాలు, మందుగుండు, టెంట్లు, ఉన్ని దుస్తులు, హీటర్లు, ఆహార పదార్థాల్లాంటివన్నీ సరిపడా అందుబాటులో ఉంచామన్నారు. దేశీయంగా తయారైన ఆర్కిటెంట్లు మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రతను, హై ఆల్టిట్యూడ్‌ టెంట్లు మైనస్‌ 40– 50 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకుంటాయన్నారు. లద్దాఖ్‌ ప్రాంతం గుండా రెండు ప్రధాన రహదారులు(మనాలీ– లేహ్, జమ్ము–శ్రీనగర్‌–లేహ్‌) పోతుంటాయి. గతంలో చలికాలం రాగానే ఈ రెండు మార్గాలు దాదాపు 6 నెలలు మూతపడేవి. కానీ ప్రస్తుతం మౌలికసదుపాయాలు మెరుగుపరిచి ఈ సమయాన్ని 4నెలలకు తగ్గించినట్లు కపూర్‌ చెప్పారు. అటల్‌ టన్నెల్, డార్చా– నీము– పదమ్‌ రహదారి అందుబాటులోకి వస్తే ఇక లద్దాఖ్‌కు సంవత్సరం పొడుగునా రవాణా సౌకర్యం ఉంటుందని వివరించారు.

మరిన్ని వార్తలు