రెచ్చగొడితే ధీటైన సమాధానం చెప్తాం 

29 Jun, 2021 04:07 IST|Sakshi

వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే అభిమతం 

తూర్పు లద్దాఖ్‌ పర్యటనలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ వ్యాఖ్యలు 

జవాన్ల సన్నద్ధతపై మంత్రి సమీక్ష 

63 మౌలిక ప్రాజెక్టుల ప్రారంభం  

గల్వాన్‌ అమరులకు ఘన నివాళి

సాక్షి, న్యూఢిల్లీ: పొరుగు దేశాలతో వివాదాలను కేవలం చర్చల ద్వారానే పరిష్కరించాలని భారత్‌ కోరుకుంటోందని, అయితే దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తేలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పదునైన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ శాంతి కాముక దేశమని, ఎలాంటి దూకుడును ఆశ్రయించదని తెలిపారు. అయితే ఎవరైనా రెచ్చ గొట్టినా, బెదిరింపులకు పాల్పడినా తగిన ధీటైన సమాధానం ఇచ్చేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం తూర్పు లద్దాఖ్‌ లోని క్యున్‌గమ్‌తోపాటు ఫార్వార్డ్‌ పోస్‌కరులో జవాన్లనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన, చైనా సహా అనవసరంగా కాలు దువ్వే ఇతర పొరుగు దేశాలకు అర్థమయ్యేలా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.

కాగా గతేడాది జూన్‌లో గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన 20 మంది సైనికులకు రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాళులర్పించారు. ఆ అమరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరచిపోదని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా, భారత్‌లు పాంగోంగ్‌ సరస్సు ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ తూర్పు లద్దాఖ్‌లోని కొన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకునేందుకు చైనా అయిష్టత చూపుతుండటంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్‌ మూడు రోజుల పర్యటన ఒక ముందడుగుగా భావించాల్సి ఉంటుంది. ఏ సమస్యకు అయినా స్పష్టమైన ఉద్దేశం ఉంటే చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించవచ్చని రక్షణ మంత్రి తెలిపారు. ‘గతేడాది దేశ ఉత్తర సరిహద్దులో మనం పెద్ద సవాలును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో మా సాయుధ దళాలు సవాలును ఎదుర్కొనే విషయంలో వారి ధైర్యాన్ని, అంకితభావాన్ని ప్రదర్శించాయి. ప్రతి సవాలుకు తగిన సమాధానం ఇచ్చే సామర్ధ్యం మన సైన్యానికి ఉంది. మనం ఎల్లప్పుడూ ప్రపంచ శాంతి కోసం పనిచేశాము. ఎవ్వరిపై దాడి చేయలేదు. మన లక్ష్యం ఎవ్వరిపై విజయం సాధించడం కాదు. భారతదేశం ఏ దేశంపై దాడి చేయలేదు సరికదా అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు. మన ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది’అని సైనికులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో భారత్‌ వైఖరిని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

అంతేగాక ‘మనం యుగాలుగా పొరుగువారే అని విషయం మన పొరుగు దేశాల వారు గుర్తెరగాలి. ఇకపై అనేక యుగాలపాటు పొరుగువారిగా ఉంటాము. వివాదాస్పద సమస్యలకు చర్చల ద్వారా శాశ్వత పరిష్కారాలు దొరకలేదా? మన దేశానికి చుట్టుపక్కల ఉన్న పొరుగువారు అందరి గురించి మాట్లాడుతున్నాను. మనకు స్పష్టమైన ఉద్దేశం ఉన్నట్లయితే ఎలాంటి వివాదాలను అయినా పరిష్కరించుకోవచ్చు’అని రక్షణమంత్రి వ్యాఖ్యానించారు. అదే సమయంలో సాయుధ దళాలకు అన్ని విధాలా సహకరించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్‌ హామీ ఇచ్చారు. సరిహద్దుల్లో జరిగే ప్రతీ ఘటనను ఎదుర్కోగల బలమైన సైనికదళాన్ని కలిగి ఉండాలన్న ప్రభుత్వ ఆలోచనను ఆయన పునరుద్ఘాటించారు. గతేడాది జూన్‌ 15న గాల్వాన్‌ లోయలో జరిగిన ఘటనలో భారత సైన్యం ప్రదర్శించిన ధైర్యాన్ని ప్రశంసించిన రాజ్‌నాథ్‌ సింగ్, దేశానికి తన సాయుధ దళాల పట్ల గర్వంగా ఉందని అన్నారు. బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) నిర్మించిన 63 వంతెనలను ప్రారంభించారు. కాగా ఆదివారం తూర్పు లద్దాఖ్‌లో భారత సైనిక సన్నద్ధతపై రాజ్‌నాథ్‌ సమీక్ష నిర్వహించారు. రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణేలకు ప్రస్తుత పరిస్థితులు, లద్దాఖ్‌–లేహ్‌ ప్రాంతంలో సైన్యం సంసిద్ధతపై ఆర్మీ చీఫ్‌ కమాండర్లు సమగ్రంగా వివరించారు.  

మరిన్ని వార్తలు