శత్రు డ్రోన్లకు చెక్‌ పెట్టేలా గద్దలకు శిక్షణ.. కంటపడితే అంతే..!

29 Nov, 2022 15:59 IST|Sakshi

న్యూఢిల్లీ: సైనికల బలగాల కన్నుగప్పి దేశంలోకి ఆయుధాలు, మాదకద్రవ్యాలను డ్రోన్ల ద్వారా చేరవేస్తున్నాయి శత్రు దేశాలు. డ్రోన్ల ద్వారానే దాడులకు పాల్పడుతున్న సంఘటనలూ ఇటీవల వెలుగు చూశాయి. ఈ క్రమంలో శత్రు డ్రోన్లను నివారించేందుకు కొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది భారత సైన్యం. తొలిసారి శత్రు డ్రోన్లను ధ్వంసం చేసేందుకు గద్దలకు శిక్షణ ఇస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ఔలీలో అమెరికా, భారత్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న యుద్ధ అభ్యాస్‌ ప్రదర్శనలో ఈ అస్త్రాన్ని భారత సైన్యం ప్రదర్శించింది. 

ఈ సైనిక ప్రదర్శన సందర్భంగా ‘అర్జున్‌’ అనే గద్ద శత్రు దేశాల డ్రోన్లను ఏ విధంగా నాశనం చేస్తుందనే విషయాన్ని చూపించారు. శత్రు దేశాలకు చెందిన డ్రోన్లు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, ధ్వంసం చేసేందుకు గద్దతో పాటు ఓ శునకానికి సైతం శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో డ్రోన్‌ శబ్దం వినబడగానే సైన్యాన్ని శునకం అప్రమత్తం చేసింది. అలాగే.. డ్రోన్‌ ఎక్కడి నుంచి వెళ్తుందనే విషయాన్ని గద్ద గుర్తించింది.

ఇలాంటి పక్షులను శత్రు డ్రోన్లను గుర్తించి, ధ్వంసం చేసేందుకు ఉపయోగించటం ఇదే తొలిసారి. అయితే, సైనికపరమైన చర్యల కోసం గద్దలు, శునకాలను వినియోగిస్తున్నట్లు భారత సైన్యం తెలిపింది. పంజాబ్‌, జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దుల గుండా దేశంలోకి ప్రవేశించే డ్రోన్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ ప్రక్రియ దోహదబడుతుందని పేర్కొంది.

ఇదీ చదవండి: ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే.. బీజేపీ ఆగ్రహం

మరిన్ని వార్తలు