సరిలేరు మీకెవ్వరు.. భారత జవాన్లపై ప్రశంసలు

8 Jan, 2021 12:48 IST|Sakshi

గర్భవతిని ఆస్పత్రికి చేర్చిన భారత జవాన్లు

శ్రీనగర్‌: భారత జవాన్లు నిజమైన హీరోలు అన్న పేరును మరోసారి నిలబెట్టుకున్నారు. ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను ఆస్పత్రికి చేర్చి మానవత్వం చాటుకున్నారు. గడ్డకట్టే చలిలో, మోకాళ్లలోతు మంచులో ఆమెను సుమారు రెండు కిలోమీటర్ల దూరం మేర మోసుకువెళ్లారు.  సదరు మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. వివరాలు.. కుప్వారాలోని ఫకియాన్‌ గ్రామానికి చెందిన మంజూర్‌ అహ్మద్‌ షేక్‌ భార్య గర్భవతిగా ఉన్నారు. ఈ క్రమంలో జనవరి 5 అర్దరాత్రి ఆమెకు ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. ఓవైపు తీవ్రమైన చలి.. మరోవైపు మంచువర్షం.. సమీపంలో ఒక్క వాహనం కూడా కానరాలేదు.. రెండు కిలోమీటర్లు దాటితే గానీ ఆస్పత్రికి చేరుకోలేరు.(చదవండి: మహిళా రైతుల ట్రాక్టర్లు వచ్చేస్తున్నాయ్‌)

ఇలాంటి పరిస్థితుల్లో భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్దామంటే అతడికి ఎటువంటి మార్గం కనిపించలేదు. దీంతో హృదయ విదారకంగా విలపిస్తూ సహాయం అర్థించసాగాడు. వెంటనే స్పందించిన ఆర్మీ జవాన్లు వైద్య బృందంతో అహ్మద్‌ ఇంటికి చేరుకున్నారు. అతడి కుటుంబ సభ్యులు వెంటరాగా నలుగురు సైనికులు ఆమెను భుజాలపై మోస్తూ కరాల్‌పురాలో ఉన్న ఆస్పత్రికి చేర్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ క్రమంలో భారత జవాన్ల మానవతా గుణంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘‘సరిలేరు మీకెవ్వరు’’ అంటూ సెల్యూట్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు