ప్రతికూల వాతావ‘రణ’మైనా రెడీ!

28 Sep, 2020 04:58 IST|Sakshi
లద్దాఖ్‌లో సిద్ధంగా ఉన్న యుద్ధ ట్యాంకులు

శీతాకాలంలో చైనా కుయుక్తుల్ని పన్నినా తిప్పికొట్టడానికి సంసిద్ధం 

లద్దాఖ్‌కు భారీగా ఆయుధాలు, ఆహారం, ఇతర సామగ్రి తరలింపు

న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు చెలరేగుతున్న తూర్పు లద్దాఖ్‌లో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత్‌ సమాయత్తమైంది. చైనా కవ్వింపు చర్యల్ని దీటుగా ఎదుర్కోవడానికి గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీగా యుద్ధ ట్యాంకులను, ఇతర సామగ్రిని తరలించింది. వచ్చే నాలుగు నెలలు శీతాకాలంలో ఎత్తయిన పర్వత ప్రాంతమైన లద్దాఖ్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొని ఉంటాయి. అక్టోబర్‌ నుంచి జనవరి మధ్య కాలంలో చలి మైనస్‌ 25 డిగ్రీల వరకు వెళుతుంది.

ఆ సమయంలో డ్రాగన్‌ దేశం ఎలాంటి కుయుక్తులు పన్నినా దీటుగా ఎదుర్కోవడానికి ఇండియన్‌ ఆర్మీ ఈ భారీ తరలింపు ప్రక్రియ చేపట్టింది. యుద్ధ ట్యాంకులు, భారీగా ఆయుధాలు, ఇంధనాన్ని తరలించినట్టు ఆర్మీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. వాటితో పాటు సైనికులకు అవసరమైన ఆహారం దుస్తులు, బూట్లు తదితర సామగ్రిని చేరవేయడం దాదాపుగా పూర్తయింది. ఈ భారీ తరలింపు కసరత్తుని చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ ఎంఎం నారవాణే, మరికొందరు కమాండర్లతో బృందంగా ఏర్పడి స్వయంగా పర్యవేక్షించారు. జూలై నుంచి మొదలు పెట్టిన ఈ ప్రక్రియని పకడ్బందీ ప్రణాళికతో నరవాణె రూపొందించి అమలయ్యేలా చూశారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా ఆయుధాలు
తూర్పు లద్దాఖ్‌లోని సమస్యాత్మక ప్రాంతాలైన చుషుల్, డెమ్‌చోక్‌లకు టీ–90, టీ–72 ట్యాంకులు, గన్స్, పదాతిదళానికి అవసరమయ్యే వాహనాలు ఇప్పటికే చేరుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా 16 వేల అడుగుల ఎత్తైన పర్వత ప్రాంతంలోని శిబిరాల్లో ఉండే జవాన్ల కోసం భారీగా ఆహార పదార్థాలు, దుస్తులు, టెంట్లు, కమ్యూనికేషన్‌ పరికరాలు, చమురు, చలి నుంచి రక్షణకి హీటర్లు తరలించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత లద్దాఖ్‌లో సైనిక శిబిరాలకు ఈ స్థాయిలో సామగ్రిని చేరవేయడం ఇదే మొదటిసారి. ఈ తరలింపు అత్యంత భారీ స్థాయిలో జరిగింది’’అని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు.

రక్తం గడ్డ కట్టే చలి నుంచి రక్షణ కోసం యూరప్‌ దేశాల నుంచి దుస్తుల్ని తెప్పించి ఇప్పటికే సైనికులకి అందించారు. ఈ సామగ్రిని తరలించడానికి వైమానిక దళానికి చెందిన సి–130జే సూపర్‌ హెర్క్యులస్, సీ–17 గ్లోబ్‌మాస్టర్‌ హెలికాప్టర్లను వినియోగించారు. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతల నివారణ కోసం చైనాతో జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాకపోవడం, సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడానికి ఆ దేశం అంగీకరించకపోవడంతో ముందు జాగ్రత్తగా భారత్‌ అన్ని రకాలుగా సిద్ధమైంది. అదనంగా మూడు సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది. అక్కడ సైనికులకి అన్ని సదుపాయాలు కల్పించింది.

మరిన్ని వార్తలు