సరిహద్దులో భారత్‌-చైనా బలగాల మధ్య ఘర్షణ.. ఇరు వర్గాలకు గాయాలు!

12 Dec, 2022 20:15 IST|Sakshi

ఈటానగర్: సరిహద్దులో భారత్-చైనా బలగాల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖ వద్ద ఇరు వర్గాలు బాహాబాహీకి దిగినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 9న జరిగిన ఈ ఘటనలో రెండు దేశాల సైనికులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఘర్షణ అనంతరం భారత్-చైనా బలగాలు ఆ ప్రాంతం నుంచి వెనుదిరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 

అయితే చైనా సైనికులే వాస్తవాధీన రేఖను చేరుకోవడంతో భారత బలగాలు ప్రతిఘటించినట్లు సమాచారం. దాదాపు 300 మంది చైనా సైనికులు 17,000 అడుగుల ఎత్తులోని భారత పోస్టును తమ అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. మన సైనికులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరు  వర్గాలు గొడవపడ్డాయి.

ఈ ఘర్షణలో ఆరుగురు భారత సైనికులకు గాయలవ్వగా.. వారిని చికిత్స నిమిత్తం గువహటి ఆస్పత్రికి తరలించినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో భారత  సైనికుల కంటే చైనా సైనికులే ఎక్కువ సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది.

2020 జూన్‌ 15న జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంతం గల్వాన్‌ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనలో ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అనేక మార్లు చర్చల అనంతరం సరిహద్దులో బలగాల ఉపసంహరణ జరిగింది. ఇప్పుడు మళ్లీ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా మరోమారు కయ్యానికి కాలు దువ్వుతోంది.
చదవండి: త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..

మరిన్ని వార్తలు