రెండు బ్యాగుల‍్లో 45 తుపాకులు.. భార్యాభర్తల అరెస్ట్‌

13 Jul, 2022 16:46 IST|Sakshi

ఢిల్లీ: బ‍్యాగుల నిండా తుపాకులతో దేశంలోకి వచ్చిన ఇద్దరు భారతీయులను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం అరెస్ట్‌ చేశారు కస్టమ్స్‌ అధికారులు. ఆ పిస్తోళ్లు నకిలివా, నిజమైనవా అని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. అయితే.. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌(ఎన్‌ఎస్‌జీ) అవి నిజమైన తుపాకులేనని తెలిపారు. 

అరెస్టయిన ఇద్దరు జగ్‌జిత్‌ సింగ్‌, జస్విందర్‌ కౌర్‌లుగా గుర్తించారు అధికారులు. వారిద్దరినీ భార్యాభర్తలుగా నిర్ధారించారు. కాగా, వారిద్దరూ జూలై 10న వియాత్నం నుంచి భారత్‌కు వచ్చారు. జగ్‌జిత్‌ సింగ్‌ తీసుకొచ్చిన రెండు ట్రాలీబ్యాగుల్లో 45 తుపాకులు లభించాయి. వాటిని అతడి సోదరుడు మంజిత్ సింగ్‌ ఇచ్చినట్లు విచారణలో తేలింది. జగ్‌జిత్‌ సింగ్‌ ఫ్రాన్స్‌లోని ప్యారీస్‌ నుంచి వియాత్నంకు వచ్చిన క్రమంలో ఆ ట్రాలీ బ్యాగులను మంజిత్‌ సింగ్‌కు ఇచ్చాడు. అందులోని మొత్తం 45 తుపాకుల విలువ సుమారు రూ.22,50,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 

గతంలోనూ 25 తుపాకుల చేరవేత.. 
అయితే, వీరిద్దరూ ఇలా తుపాకులను చేరవేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఓసారి పిస్తోళ్లు తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. టర్కీ నుంచి భారత్‌కు 25 తుపాకులు తెచ్చినట్లు విచారణ సందర్భంగా నిందితులు అంగీకరించారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న అధికారులు తదుపరి విచారణ చేపట్టినట్టు తెలిపారు.

ఇదీ చూడండి: కోవిడ్‌ టీకా తీసుకున్నవారికి రూ.5 వేల రివార్డు.. నిజమెంత?

మరిన్ని వార్తలు