కాబూల్‌ పేలుళ్లు: ‘అసలు ఇండియాలో అడుగు పెడతామనుకోలేదు’ 

27 Aug, 2021 12:28 IST|Sakshi
కాబూల్‌ నుంచి ఢిల్లీ చేరుకున్న షివాంగ్‌ దవే దంపతులు (ఫోటో కర్టెసీ: ఇండియాటుడే)

భయానక అనుభవాలను వెల్లడించిన భారతీయ జంట

సాక్షి, వెబ్‌డెస్క్‌: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించిన నాటి నుంచి ఆ దేశంలో పరిస్థితులు దిగజారిపోయాయి. ఈ క్రమంలో పలు దేశాలు అఫ్గన్‌లో ఉన్న తమ దేశీయుల తరలింపుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే గురువారం దేశాన్ని వదిలి వెళుతున్న పాశ్చాత్యులు, అఫ్గన్లు లక్ష్యంగా కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం ఆత్మాహుతి దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి భయంకర పరిస్థితుల నుంచి క్షేమంగా స్వదేశం చేరుకున్న ఓ భారతీయ జంట తాము ఎదర్కొన్న భయానక అనుభవాల గురించి వివవరించింది. ఇప్పటికే భారత ప్రభుత్వం అఫ్గన్‌ నుంచి 800 మంది భారతీయులను క్షేమంగా దేశానికి చేర్చింది. ఇలా చేరుకున్న వారిలో గుజరాత్‌కు చెందిన షివాంగ్‌ దవే, అతడి భార్య కూడా ఉన్నారు. 

ఈ క్రమంలో వారు తాము ఎదొర్కన్న భయానక అనుభవాలు, ఉద్రిక్త పరిస్థితుల గురించి వెల్లడించారు దవే దంపతులు. షివాంగ్‌ దవే మాట్లాడుతూ.. ‘‘నేను గత 15 ఏళ్లుగా అఫ్గన్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాను. నాకు ఇద్దరు కుమారులు రోహిత్‌భయ్‌ దవే, మరొకరు ప్రముఖ గుజరాత్‌ కవి హరింద్ర దవే. తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించిన తర్వాత మేం అక్కడ బతకడం అసాధ్యం అని మాకు అర్థం అయ్యింది. భారత ప్రభుత్వం మమ్మల్ని తరలించేందుకు ముందుకు వచ్చింది’’ అని తెలిపాడు. (చదవండి: పాకి​స్తాన్‌ మా రెండో ఇల్లు : తాలిబన్లు)

కాబూల్‌ విమానాశ్రయం చేరుకుంటే తప్ప మా భవిష్యత్‌ ఏంటో అర్థం కాదు. ఇక మా ఇంటి దగ్గర నుంచి కాబూల్‌ విమానాశ్రయం చేరుకునే దారి వెంబడి మాకు ఎన్నో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత కాబూల్‌ విమానాశ్రయం వెళ్లే దారులన్నింటిని మూసేశారు. రోడ్ల మీద పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. వీటన్నింటిని దాటుకుని విమానాశ్రయం చేరుకున్నాము’’ అని తెలిపాడు దవే. (చదవండి: కాబూల్‌ రక్తసిక్తం:100 మందికి పైగా మృతి! )

దవే భార్య మాట్లాడుతూ.. ‘‘అసలు మేం కాబూల్‌ విమానాశ్రయం చేరుకుంటామా.. లేదా అనే భయం వెంటాడసాగింది. ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి విమానాశ్రయం చేరుకున్నాము. కానీ అక్కడ అనుకోని ఉపద్రవం ఏర్పడింది. తాలిబన్లు నా భర్తను బంధించారు. నాకు అర్థం అయ్యింది.. మా జీవితాలు ఇక్కడే ముగిసిపోతాయి.. మేం మా స్వదేశం వెళ్లమని తెలిసింది. కాకపోతే అదృష్టం కొద్ది మే తాలిబన్ల చేతుల నుంచి బయటపడి.. ఇండియా వెళ్లే విమానం ఎక్కగలిగాము’’ అని గుర్తు చేసుకున్నారు.(చదవండి: ఇక అంతా తాలిబన్ల సహకారంతోనే..)

‘‘ఆ తర్వాత అనేక చోట్ల ఆగుతూ మా ప్రయాణం కొనసాగింది. విమానం గాల్లోకి లేచి.. భారత్‌లో ల్యాండ్‌ అయ్యే వరకు ఊపిరి బిగపట్టుకుని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాము. గాల్లో ఉండగా కిందకు చూస్తే.. ప్రతి 40-50 మీటర్లకు ఓ చోట పేలుళ్లు చోటు చేసుకునే ఘటనలు దర్శనమిచ్చాయి. మా జీవితంలో అంతలా భయపడిన దాఖలాలు లేవు. ఆదివారం భారత్‌లో ల్యాండ్‌ అయ్యాము. ఆ తర్వాత గుజరాత్‌లోని మా ఇంటికి చేరుకున్నాం. ప్రస్తుతం మా బ్యాంక్‌ ఖాతాలో డబ్బులు లేవు.. మాకు ఉద్యోగం లేదు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అర్థం కావడం లేదు’’ అని దవే దంపతులు వాపోయారు. 
 

మరిన్ని వార్తలు