భార్యభర్తల బంధం తెగినా.. ఒక్కటిగానే మృత్యువు ఒడిలోకి..

31 May, 2022 12:00 IST|Sakshi

Indian Family Died in Nepal Plane Crash: మనస్పర్థలు పెరిగాయి. భార్యాభర్తల బంధానికి బీటలు వారింది. చట్టం దృష్టిలో విడాకులతో వాళ్లిద్దరూ విడిపోయారు. కానీ, కన్నబిడ్డల రూపంలో దగ్గరగా గడిపే అవకాశం దొరికింది ఆ జంటకు. వారి మధ్య సంతోషాన్ని చూసి ఆ విధికి కన్ను కుట్టిందేమో.. విషాదాంతంగా ముగిసింది ఆ కుటుంబం కథ. 

నేపాల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ దుర్ఘటనలో ఇప్పటిదాకా 22 మృతదేహాలను గుర్తించారు. ఘటనస్థలం నుంచి బ్లాక్‌బాక్స్‌ను సేకరించి.. ప్రమాదానికి గల కారణాలను కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అయితే.. దుర్మరణం పాలైన వాళ్లలో భారత్‌కు చెందిన ఓ కుటుంబం కూడా ఉండడం.. విషాదాన్ని నింపుతోంది.

ఒడిషాకు చెందిన అశోక్‌ కుమార్‌ త్రిపాఠి(54), ఆయన భార్య వైభవి బందేకర్‌ త్రిపాఠి(51)కి చాలాకాలం కిందటే వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. అశోక్‌ కుమార్‌ మరో వివాహం చేసుకున్నాడు. కానీ, వైభవి మాత్రం తన తల్లితో ఉంటూ.. కన్నబిడ్డలిద్దరి బాధ్యతలు చూసుకుంటోంది. అయితే విడాకులతో విడిపోయినా ఆ జంటకు కలిసే అవకాశం కల్పించింది న్యాయస్థానం. ఏడాదిలో పది రోజుల పాటు కొడుకు, బిడ్డతో కలిసి సరదాగా గడపాలని ఈ మాజీ జంటకు ఆదేశించింది. 

విడాకుల తర్వాత అశోక్‌ ఒడిషాలోనే ఉంటూ ఓ కంపెనీని రన్‌ చేస్తున్నాడు. థానే(ముంబై)లో ఉంటూ ఓ ఫైనాన్షియల్‌ కంపెనీని నడిపిస్తోంది వైభవి. ఈ క్రమంలో.. కొడుకు ధనుష్‌ (22), కూతురు రితిక(15)తో కలిసి ఈ ఏడాదికిగానూ హిమాలయా పర్యటనకు వెళ్లారు. 

ఆదివారం నేపాల్‌ టూరిస్ట్‌ సిటీ అయిన పొఖారాకు వెళ్లారు. అదే రోజు జరిగిన ఘోర ప్రమాదంలో ఈ కుటుంబం దుర్మరణం పాలైంది. వీళ్ల మరణ వార్తతో థానేలోని బల్కమ్‌ ఏరియాలో విషాదం నెలకొంది. ఇక్కడే రుస్తోమ్‌జీ అథేనా హౌజింగ్‌ సొసైటీలో వైభవి నివాసం ఉంటోంది. ప్రమాదం వార్త విని స్థానికులంతా షాక్‌లో ఉన్నారు.
 

మరిన్ని వార్తలు