జైషే టాప్‌ కమాండర్‌ హతం

1 Aug, 2021 04:14 IST|Sakshi

ఎన్‌కౌంటర్‌లో జైషే చీఫ్‌

అజార్‌ మేనల్లుడు లంబూ సహా ఇద్దరు కాల్చివేత

‘2019 పుల్వామా దాడి’ ఘటనకు లంబూ సూత్రధారి అని అనుమానం

శ్రీనగర్‌: కశ్మీర్‌లో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. పుల్వామా జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో పాక్‌కు చెందిన జైషే మొహమ్మద్‌ కశ్మీర్‌ కమాండర్, ఆ సంస్థ చీఫ్‌ మసూద్‌ అజార్‌ మేనల్లుడు, 2019 పుల్వామా దాడి సూత్రధారిగా భావిస్తున్న మొహమ్మద్‌ ఇస్మాయిల్‌ అల్వి అలియాస్‌ లంబూ అలియాస్‌ అద్నన్‌ సహా మరొకరు హతమయ్యారు. గురువారం కశ్మీర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(ఐజీపీ) విజయ్‌ కుమార్‌ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.

ఉగ్రమూకల కదలికలున్నాయన్న నిఘా వర్గాల సమాచారం మేరకు గురువారం నమిబియాన్, మర్సార్, డాచిగాం అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు కార్డన్‌సెర్చ్‌ చేపట్టాయి. ఈ సమయంలో చిన్నారులు, మహిళలను అడ్డుగా పెట్టుకుని ఉగ్రవాదులు తప్పించుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా వారు కాల్పులకు దిగగా దీటుగా బలగాలు స్పందించాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ‘మృతుల్లో పాకిస్తాన్‌కు చెందిన టాప్‌ మోస్ట్‌ ఉగ్రవాది, జైషే మొహమ్మద్‌కు చెందిన లంబూ ఉన్నాడు.

ఇతడు జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ మేనల్లుడు. 2019లో జరిగిన పుల్వామా దాడి కుట్రకు సూత్రధారి. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) చార్జిషీటులో ఇతడి పేరు  ఉంది’ అని ఐజీపీ వెల్లడించారు. ఈ ఘన విజయం సాధించిన పోలీసులు, బలగాలను ఆయన అభినందించారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో శ్రీనగర్‌–జమ్మూ జాతీయ రహదారిపై వెళ్తున్న సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై అదిల్‌ అద్నాన్‌ అనే ఆత్మాహుతి దళ ఉగ్రవాది పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో దాడి చేయగా 40 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అద్నాన్‌కు శిక్షణ ఇచ్చింది లంబూయేనని భద్రతాధికారులు చెబుతున్నారు.

ఎవరీ లంబూ?
మొహమ్మద్‌ ఇస్మాయిల్‌ అల్వి అలియాస్‌ లంబూకు అబూ సైఫుల్లా అనీ ఫౌజీ భాయి అని కూడా పేర్లున్నాయి. ఇతడు జైషే మొహమ్మద్‌ కశ్మీర్‌ ప్రధాన కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. పాకిస్తాన్‌లోని బహావల్పూర్‌లోని కోసర్‌ కాలనీకి చెందిన వాడు. ఐఈడీ తయారీలో ఇతడు దిట్ట. 2017లో కశ్మీర్‌లోకి అక్రమంగా చొరబడ్డాడు. అవంతిపొరా, పుల్వామా, అనంత్‌నాగ్‌ జిల్లాల్లో ఇతడు ఉగ్ర కార్యకలాపాలు సాగించాడు. త్రాల్‌లోపాటు జాతీయరహదారిపై ఉగ్ర దాడులకు ఇతడు యత్నించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

స్థానిక ఉగ్రవాది సమీర్‌ అహ్మద్‌ దార్‌తో కలిసి పుల్వామాలో పనిచేశాడు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల తరఫున కూడా లంబూ పోరాడాడు. భారత బలగాలపై రాళ్లు రువ్వడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా కశ్మీర్‌ యువతను ప్రేరేపించినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. అవంతిపొరా, కాక్‌పొరా, పుల్వామా తదితర ప్రాంతాల నుంచి యువతను ఉగ్రమార్గం పట్టించి, వారిని ఇతర ప్రాంతాలకు పంపించడంలో ఇతడు కీలకంగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్నాయి. ఇతడిపై 14 కేసులు నమోదయ్యాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు