వీపీఎన్‌ సేవలపై కేంద్రం సంచలన ప్రకటన.. ప్రొవైడర్లతో పాటు యూజర్లకు బ్యాండే!

19 May, 2022 17:18 IST|Sakshi

న్యూఢిల్లీ:  వీపీఎన్‌.. వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌. ఇంటర్నెట్‌ను విపరీతంగా వాడే వాళ్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇంటర్నెట్‌ సురక్షిత వాడకంగానే కాదు.. నిషేధించిన, మన దేశంలో అందుబాటులో లేని కంటెంట్‌ కోసం ఉపయోగించే ప్రత్యామ్నాయ మార్గంగా వీపీఎన్‌ సేవలపై ఓ విమర్శ ఉంది. అయితే ఈ సేవలపై కేంద్రం ఇప్పుడు సంచలన ప్రకటన చేసింది.  

భారత్‌లో నిబంధనలకు, మార్గదర్శకాలకు లోబడి నడుచుకోవాలని.. కుదరదనుకుంటే భారత్‌ నుంచి శాశ్వతంగా నిష్క్రమించొచ్చని వీపీఎన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ బుధవారం ఒక ప్రకటన చేశారు. కేంద్రం ఇదే మొండి నిర్ణయంతో ముందుకు వెళ్తే.. వీపీఎన్‌ సేవలను ఉపయోగిస్తున్న 27 కోట్ల మంది యూజర్లపై ప్రభావం పడడం ఖాయం. 

భారత్‌ చట్టాలకు, నిబంధనలకు అనుగుణంగా ఉండనివాళ్లకు అవకాశం ఇచ్చేదే లేదు. కుదరదని అనుకుంటే.. నిర్మొహమాటంగా సర్వీసులను దేశంలో నిలిపివేసుకోవచ్చు అని స్పష్టం చేశారాయన. అంతేకాదు వీపీఎన్‌ కంపెనీలు, డేటా సెంటర్‌ కంపెనీలు, వర్చువల్‌ ప్రైవేట్‌ సర్వర్‌ ప్రొవైడర్లు.. యూజర్ల డాటాను కనీసం ఐదేళ్లపాటు భద్రపరచ్చాల్సిందేనని స్పష్టం చేశారాయన. 

కొత్త రూల్ సైబర్ సెక్యూరిటీ లొసుగులకు దారితీయవచ్చని, సైబర్‌ దాడులు జరగవచ్చని కొన్ని VPN కంపెనీలు పేర్కొన్నాయి. కానీ, ఈ వాదనను కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌ మాత్రం తిరస్కరిస్తున్నారు. మరోవైపు అమెరికాకు చెందిన టెక్‌ ఇండస్ట్రీ బాడీ ఐటీఐ (ఇందులో గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఐబీఎం, సిస్కో లాంటి ప్రముఖ కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి) నిబంధనలపై సమీక్షించుకోవాలని భారత ప్రభుత్వ ఆదేశాన్ని సవరించాలని కోరింది. కానీ, భారత్‌ మాత్రం అందుకు ససేమీరా చెబుతోంది. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగానే నడచుకోవాలని స్పష్టం చేస్తోంది.  దేశంలోని సైబర్ వాచ్‌డాగ్‌గా పేరున్న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ద్వారా ఈ ఆదేశాన్ని జారీ చేసింది కేంద్రం. కొత్త మార్గదర్శకాలు 60 రోజుల జారీ తర్వాత అమలులోకి వస్తాయి. ఇప్పటికే జారీ కాగా.. జూన్ చివరి నాటికి అమలులోకి రానున్నాయి.

వీపీఎన్‌ సర్వీసుల విషయంలో నిబంధనలు

సబ్‌స్క్రయిబర్‌, కస్టమర్‌కు సంబంధించి సరైన పేరును ఇవ్వాలి

సేవలను ఎంత కాలం వినియోగించుకుంటారో స్పష్ట ఇవ్వాలి

యూజర్లకు ఐపీలను కేటాయించాలి
రిజిస్ట్రేషన్‌ టైంలో.. ఈ-మెయిల్‌, ఐపీ అడ్రస్‌,  టైమ్‌ స్టాంప్‌ వివరాలను పొందుపర్చాలి

అయితే వీపీఎన్‌ను ఎందుకు తీసుకుంటున్నారో.. కస్టమర్‌ తెలియజేయాలి. 

సరైన చిరునామా, కాంటాక్ట్‌ నెంబర్లు ఇవ్వాలి. 

సబ్‌స్క్రయిబర్ల ఒనర్‌షిప్‌ ప్యాటర్న్‌ను సమర్పించాలి


మెజార్టీ యూజర్లు వీటిని ఇవ్వడానికి ఇష్టపడరు. ఇవేవీ చేయలేవు గనుకే వీపీఎన్‌ ప్రొవైడర్లు వెనకాడుతున్నాయి.

మరిన్ని వార్తలు