నేవీ అమ్ములపొదిలోకి వాగీర్‌.. జలాంతర్గామి విశేషాలివే..

24 Jan, 2023 05:08 IST|Sakshi

ముంబై: అత్యాధునిక ఆయుధ వ్యవస్థ, వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం, గుట్టుగా మో­హరించే దమ్ము ఉన్న నూతన జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ వాగీర్‌ లాంఛనంగా భారత నావికాదళంలో చేరింది. సోమవారం ముంబైలోని నావల్‌ డాక్‌యార్డ్‌ ఇందుకు వేదికైంది. కల్వరీ శ్రేణి జలాంతర్గాముల్లో చివరిది, ఐదవది అయిన వాగీర్‌ను నావికా దళ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ లాంఛనంగా భారత నేవీలోకి ప్రవేశపెట్టారు. ‘వాగీర్‌ రాకతో సముద్రజలాల్లో శత్రువుల బారి నుంచి దేశ ప్రయోజనాలను మరింతగా సంరక్షించవచ్చు.

ఇంటెలిజెన్స్, నిఘా, మొహరింపు విభాగాల్లో నేవీ సామర్థ్యాన్ని వగర్‌ పరిపుష్టంచేస్తుంది’ అని ఈ సందర్భంగా భారత నేవీ ప్రకటించింది. ఎలాంటి జంకు లేకుండా దాడి చేసే ఇసుక షార్క్‌ చేప(వాగీర్‌) పేరును దీనికి పెట్టారు. 24 నెలల వ్యవధిలో నేవీ చేరిన మూడో సబ్‌మరైన్‌ ఇది. మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ సంస్థ దీనిని తయారుచేసింది. ఫ్రాన్స్‌ నుంచి బదిలీచేసిన సాంకేతికతను ఇందులో వినియోగించారు. 11 నెలలపాటు సముద్రంలో పలు రకాల ప్రయోగ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాక సోమవారం నేవీలోకి తీసుకున్నారు.

జలాంతర్గామి విశేషాలు
► ప్రపంచంలోనే అత్యత్తుమ సెన్సార్‌లను దీనిలో అమర్చారు.
► వైర్‌ ఆధారిత టోర్పెడోలున్నాయి.
► దీని ద్వారా సముద్ర అంతర్భాగం నుంచి క్షిపణులను సముద్రజలాల మీది లక్ష్యాలపైకి ప్రయోగించవచ్చు
► స్పెషల్‌ ఆపరేషన్స్‌లో మెరైన్‌ కమెండోలను శత్రు స్థావరాలలోకి చడీచప్పుడుకాకుండా తరలించగలదు.
► శక్తివంత డీజిల్‌ ఇంజిన్‌తో పనిచేస్తుంది.
► శత్రు టోర్పెడోలను ఏమార్చే నూతన స్వీయ రక్షణ వ్యవస్థతో దీనిని బలోపేతం చేశారు 

మరిన్ని వార్తలు