ఆక్సిజన్‌ సగమే చాలు: కరోనా పేషెంట్లకు నేవీ ‘ఓఆర్‌ఎస్‌’

27 May, 2021 08:16 IST|Sakshi

‘ఆక్సిజన్‌ రీసైక్లింగ్‌ సిస్టం’ను రూపొందించిన నావికా దళం 

ఒక్కో సిలిండర్‌ను 2–4 రెట్లు ఎక్కువ

సమయం వినియోగించుకునే అవకాశం 

సెంట్రల్‌ డెస్క్‌, సాక్షి: కరోనా విజృంభణతో పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. శ్వాస సమస్యలు తలెత్తడంతో వేలాది మందికి ఆక్సిజన్‌ అవసరం పడుతోంది. ఇది తీవ్ర కొరతకు దారి తీసింది. ఇలాంటి సమయంలో ఆక్సిజన్‌ను రీసైకిల్‌ చేస్తూ, ఎక్కువ సేపు వినియోగించుకునేలా భారత నావికా దళం ‘ఆక్సిజన్‌ రీసైక్లింగ్‌ సిస్టం (ఓఆర్‌ఎస్‌)’ను అభివృద్ధి చేసింది. కరోనా పేషెంట్లకు మాత్రమే కాదు.. ఆక్సిజన్‌ అవసరమైన అందరికీ ప్రయోజనం కలిగించే ఈ ఓఆర్‌ఎస్‌ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? 

వృథాను అరికడుతూ.. 
సాధారణంగా మనం పీల్చే గాలి నుంచి కొంత ఆక్సిజన్‌ను మాత్రమే ఊపిరితిత్తులు పీల్చుకుంటాయి. మిగతా ఆక్సిజన్, ఇతర వాయువులకు కార్బన్‌డయాక్సైడ్‌ అదనంగా తోడై బయటికి వెళ్లిపోతాయి. అంటే చాలా వరకు ఆక్సిజన్‌ వృథా అవుతున్నట్టే. ఈ వృథాను అరికట్టేలా ‘ఓఆర్‌ఎస్‌’ను రూపొందించారు. 

  • ఓఆర్‌ఎస్‌ వ్యవస్థతో వినియోగిస్తే.. ప్రస్తుతమున్న మెడికల్‌ ఆక్సిజన్‌ సిలిండర్లనే రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ సమయం పాటు వాడుకోవచ్చు. 

డిజైన్‌ చేసింది ఎవరు? 
నావికా దళంలో.. నీటిలోకి లోతుగా వెళ్లి, ఎక్కువసేపు మునిగి ఉండటం (డైవింగ్‌)పై శిక్షణ ఇచ్చే నేవీ డైవింగ్‌ స్కూల్‌కు చెందిన లెఫ్టినెంట్‌ కమాండర్‌ మయాంక్‌ శర్మ ‘ఓఆర్‌ఎస్‌’ను డిజైన్‌ చేశారు. దీనిపై నేవీ పేటెంట్‌ కూడా పొందింది. 

  • ఈ ఏడాది ఏప్రిల్‌ 22న ఈ పరికరం ఆపరేషనల్‌ ప్రొటోటైప్‌ (పూర్తిస్థాయిలో పనిచేయగల తొలి నమూనా)ను రూపొందించారు. తర్వాత పలు మార్పులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. 


ఎలా పనిచేస్తుంది? 
పేషెంట్లు ఆక్సిజన్‌ను శ్వాసించి వదిలినప్పుడు అందులో కొంత మాత్రమే వినియోగం అవుతుంది. మిగతా ఆక్సిజన్, శరీరంలో ఉత్పత్తయ్యే కార్బన్‌డయాక్సైడ్‌ బయటికి వెళ్లిపోతాయి. వీటిలో ఆక్సిజన్‌ను తిరిగి వినియోగించుకుని, కార్బన్‌ డయాక్సైడ్‌ను మాత్రం బయటికి పంపడమే ‘ఓఆర్‌ఎస్‌’ వ్యవస్థ చేసే పని. 

  • ‘ఓఆర్‌ఎస్‌’లో పేషెంట్లకు అమర్చే మాస్కుకు మరో పైపును అదనంగా ఏర్పాటు చేశారు. దానికి ఒక తక్కువ ప్రెషర్‌ ఉండే మోటార్‌ను అమర్చారు. పేషెంట్లు శ్వాసించి వదిలిన గాలిని ఆ మోటార్‌ లాగేస్తుంది. అందులో కార్బన్‌డయాక్సైడ్‌ను తొలగించి, ఆక్సిజన్‌ను తిరిగి వినియోగించేలా ఏర్పాటు ఉంటుంది. 

ఎలా పరీక్షించారు? 
నేవీ అధికారులు 250 లీటర్ల ద్రవ ఆక్సిజన్‌ సిలిండర్‌కు ప్రత్యేకంగా రూపొందించిన వేపరైజర్‌ను, ఆక్సిజన్‌ను నేరుగా పేషెంట్లకు వినియోగించగలిగేలా ప్రెషర్‌ వాల్వులు, లీక్‌ ప్రూఫ్‌ పైపులతో కూడిన ఔట్‌లెట్‌ను అమర్చారు. అంటే నేరుగా ద్రవ ఆక్సిజన్‌ సిలిండర్‌ నుంచే ఆక్సిజన్‌ పీల్చుకునేలా ఏర్పాటు ఉంటుంది. 

  • సాధారణంగా ద్రవ ఆక్సిజన్‌ను నేరుగా వినియోగించడానికి వీలు ఉండదు. దానిని వేపరైజర్, ఇతర పరికరాలతో ఇతర ట్యాంకుల్లో నింపుతారు. వాటి నుంచి పైపులు అమర్చి వినియోగిస్తారు. నేవీ చేసిన ఏర్పాటులో.. ద్రవ ఆక్సిజన్‌ సిలిండర్‌ నుంచే నేరుగా వాడుకోవచ్చు. 

తయారీకి ఖర్చు పది వేలే.. 
నేవీ తయారు చేసిన ‘ఓఆర్‌ఎస్‌’ ప్రాథమిక నమూనాకు అయిన ఖర్చు రూ.10 వేలు మాత్రమే. దీనిని అమర్చి, ఆక్సిజన్‌ను రీసైకిల్‌ చేయడం ద్వారా.. సుమారు రోజుకు రూ.3 వేల వరకు ఆదా చేయవచ్చని అంచనా. అంటే పేషెంట్లపై గణనీయ స్థాయిలో ఖర్చు తగ్గుతుంది.  

ఎన్నో రంగాలకు ప్రయోజనం 
‘ఓఆర్‌ఎస్‌’ పరికరంతో కేవలం ఆక్సిజన్‌ అవసరమైన పేషెంట్లకు మాత్రమే కాకుండా ఎన్నో రంగాల వారికి ప్రయోజనం కలుగనుంది. హిమాలయాలు వంటి పర్వతాలను అధిరోహించేవారు, ఎత్తైన ప్రాంతాల్లో పనిచేసే సైనికులు, జలంతర్గాముల్లో, సముద్రాల లోతుల్లో అన్వేషణలు జరిపేవారు.. ఇలా చాలా మందికి ఆక్సిజన్‌ అవసరం ఉంటుంది. ఇందుకోసం వారు బరువైన సిలిండర్లను భుజాన మోయాల్సి వస్తుంది. నేవీ పరికరంతో అలాంటి వారికి సిలిండర్ల బరువు, ఆక్సిజన్‌ ఖర్చు తగ్గిపోనుంది.

చదవండి: 4 గంటలు శ్రమించి.. బ్లాక్‌ ఫంగస్‌ తొలగించి..

మరిన్ని వార్తలు