ఎలాంటి సవాలు ఎదురైనా తిప్పికొడతాం

4 Dec, 2021 06:03 IST|Sakshi

దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు

చీఫ్‌ ఆఫ్‌ నావల్‌ స్టాఫ్‌ అడ్మిరల్‌ హరికుమార్‌

న్యూఢిల్లీ: దేశ భద్రతకు ఎలాంటి సవాలు ఎదురైనా తిప్పికొట్టే పూర్తి సమర్థత భారత నావికాదళానికి ఉందని చీఫ్‌ ఆఫ్‌ నావల్‌ స్టాఫ్‌ అడ్మిరల్‌ హరి కుమార్‌ చెప్పారు. త్రివిధ దళాలల్లో ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలను ఆయన సమర్థించారు. మారిటైమ్‌ థియేటర్‌ కమాండ్‌ ఏర్పాటు చేయాలనుకోవడం మంచి ఆలోచన అని చెప్పారు. శుక్రవారం నావికాదళ దినోత్సవం(నావీ డే) సందర్భంగా హరికుమార్‌ మీడియాతో మాట్లాడారు.

దేశంలో కోవిడ్‌–19 మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సమయంలోనే ఉత్తర సరిహద్దుల్లో భద్రతపరంగా సంక్లిష్టమైన పరిస్థితులు తలెత్తాయని గుర్తుచేశారు. అవి ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇది మనకు పరీక్షా సమయమని, అందుకే తీర ప్రాంత భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని అన్నారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. హిందూ మహాసముద్రంలో చైనా నావికాదళం కదలికలను నిశితంగా గమనిస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు భారత నావికాదళం సిద్ధంగా ఉందని తెలిపారు.

మన నావికాదళానికి అవసరమైన 72 ప్రాజెక్టులను  రూ.1.97 లక్షల కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందన్నారు. ఇందులో రూ.1.74 లక్షల కోట్ల విలువైన 59 ప్రాజెక్టులను దేశీయంగానే అమలు చేయనున్నట్లు వివరించారు. మారిటైమ్‌ థియేటర్‌ కమాండ్‌ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోందని, మరో ఆరు నెలల్లో ఖరారు కానుందని అడ్మిరల్‌ హరికుమార్‌ పేర్కొన్నారు. యుద్ధ నౌకల్లో కీలకమైన విధుల్లో మహిళలను సైతం నియమిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యతోసహా 15 భారీ యుద్ధనౌకల్లో 28 మంది మహిళా అధికారులను నియమించామన్నారు. ఈ సంఖ్య మరింత పెరగనుందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు