ఒడిశా రైలు ప్రమాదం: ఇంకా గుర్తించని 81 మృతదేహాలు

7 Jun, 2023 13:23 IST|Sakshi

ఒడిశాలోని బాలాసోర్‌లో జూన్‌ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగి 110 గంటలు గడిచినప్పటికీ ఇంకా 81 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. 205 మృతదేహాలను మాత్రమే గుర్తించారు.  మిగిలిన మృతదేహాలను గుర్తించేందుకు భారతీయ రైల్వే వార్తాపత్రికలలో ప్రకటనల ద్వారా ప్రజల సహాయాన్ని కోరుతోంది.

రైల్వే విభాగం ఒక వెబ్‌సైట్‌ లింకును ప్రకటిస్తూ దానిలో మృతదేహాల ఫొటోలను పోస్ట్‌ చేసింది. ఈ సమాచారం వీలైనంతమందికి చేరితే మృతుల కుటుంబాలకు ఈ విషయం తెలుస్తుందని రైల్వేశాఖ భావిస్తోంది. భారతీయ రైల్వే www.srcodisha.nic.in వెబ్‌సైట్‌లో మృతుల ఫొటోలను ఉంచింది. ఈ మృతదేహాలను బాడీ నంబరు 1, 2, 3... 151, 152... 288లుగా పేర్కొంది. కాగా ఈ ఫొటోలలో ఘటన తాలూకా భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కొన్ని మృతదేహాలు చిధ్రమైపోయిన స్థితిలో ఉన్నాయి. రైల్వే విభాగం వార్తా పత్రికలలో ప్రకటనలు ఇవ్వడంలో పాటు హెల్ప్‌లైన్‌ నంబర్లు(139, 1929, 1800-3450061) కూడా ఇచ్చింది. దీనితోపాటు ప్రమాదానికి సంబంధించిన అన్ని వివరాలను www.osdma.org  అనే వెబ్‌సైట్‌లో ఉంచింది. గాయపడినవారి వివరాలను www.bmc.gov.in వెబ్‌సైట్‌లో తెలియజేసింది. ఈ ప్రమాదంలో 1100 మంది గాయపడగా, వారిలో 900 మంది చికిత్స పొందిన అనంతరం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 200 మంది బాధిత ప్రయాణికులు ఇంకా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. 

చదవండి: శవాల కుప్పలోంచి కుమారుని శరీరాన్ని బయటకు లాగి...

మరిన్ని వార్తలు