ట్రైన్‌లో తోటి ప్రయాణికులపై దాడి చేస్తే మూడేళ్లు జైలు

23 Feb, 2023 15:10 IST|Sakshi

కొరుక్కుపేట(చెన్నై): రైలులో ప్రయాణిస్తున్న సమయంలో తోటి వారిపై దాడికి పాల్పడితే మూడేళ్లు జైలు శిక్ష, జరిమానా తప్పదని రైల్వే ఏడీజీపీ వనిత హెచ్చరించారు. ఈనెల 16న కదులుతున్న రైలులో ఉత్తరాదికి చెందిన వ్యక్తిపై కొందరు దాడి చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సెంట్రల్‌ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసిన రైల్వే సెక్యూరిటీ ఫోర్స్‌ పోలీసులు సహకారంతో ఐదుగురిని అరెస్టు చేశారు.

ఈ విషయమై ఏడీజీపీ వనిత మీడియాతో మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో ఉత్తరాది వారి వల్ల తమిళనాడు ప్రజలకు ఉదోగావకాశాలు రావడం లేదని, దీనికి ప్రధాని మోదీయే కారణమంటూ కొందరు దాడులకు పాల్పడడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో  రాజకీయ, వ్యక్తిగత ద్వేషపూరిత మాటలతో పలువురిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నారు. ఇక కొందరు కుల మత భావాలను రెచ్చగొట్టి అశాంతికి కారణం అవుతున్నారని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధితులు ఫిర్యాదుల కోసం 1512 టోల్‌ ఫ్రీ నంబరును సంప్రదించాలని ఆమె సూచించారు.

చదవండి  చిన్నారి చికిత్సకు రూ. 11 కోట్ల విరాళం.. కనీసం పేరు చెప్పకుండా!

మరిన్ని వార్తలు