రైల్వేస్టేషన్లలో అదనపు బాదుడుకు ప్లాన్‌! రైలెక్కినా దిగినా రూ.10 నుంచి 50?

9 Jan, 2022 09:54 IST|Sakshi
కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌ సమీప ఆధునిక రైల్వేస్టేషన్‌

న్యూఢిల్లీ: దేశంలోని పలు రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మార్చేసి అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని మనం మురిసిపోతున్నాం కానీ, ఆ మౌలిక సదుపాయాలకయ్యే ఖర్చుని ప్రయాణికులపై బాదడానికి రైల్వే శాఖ సన్నద్ధమైంది. ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లలో రైలు ఎక్కాలన్నా, దిగాలన్నా ప్రయాణికుల జేబుకి ఇక చిల్లు పడడం ఖాయం. ఈ స్టేషన్లలో లెవీ ఫీజు వసూలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా రైల్వే శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. ఆయా స్టేషన్లు వినియోగంలోకి వచ్చిన తర్వాత ఈ ఫీజులు వసూలు చేస్తామని చెప్పారు.

  మోదీ చిన్నతనంలో టీ అమ్మిన స్టేషన్‌

రైల్వే స్టేషన్‌ అభివృద్ధి ఫీజుని వారు ప్రయాణించే తరగతులని బట్టి రూ.10 నుంచి రూ.50 వరకు నిర్ణయించే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలో అదనంగా వసూలు చేస్తారు. ఈ లెవీ ఫీజు మూడు కేటగిరీల్లో ఉంటుంది. ఏసీ తరగతుల్లో ప్రయాణించే వారి నుంచి రూ.50, స్లీపర్‌ క్లాసు ప్రయాణికులకు రూ.25, జనరల్‌ బోగీలలో ప్రయాణించే వారి నుంచి రూ.10 వసూలు చేయనున్నట్టుగా రైల్వే బోర్డు జారీ చేసిన సర్క్యులర్‌ వెల్లడించింది. ఆయా స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్‌ టిక్కెట్‌ ధరని కూడా మరో 10 రూపాయలు పెంచనున్నారు. సబర్బన్‌ రైల్వే ప్రయాణాలకు మాత్రం ఈ లెవీ ఫీజులు ఉండవు.

మరిన్ని వార్తలు