Indian Republic Day 2023: చర్చలకు చక్కని వేదిక

26 Jan, 2023 06:18 IST|Sakshi

న్యూఢిల్లీ: పెరుగుతున్న భూతాపం, పర్యావరణ మార్పు వంటి కీలక అంశాలపై చర్చకు, వాటి పరిష్కారానికి జీ20 సదస్సు సరైన వేదిక అని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు. బుధవారం ఢిల్లీ నుంచి ఆమె భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తొలిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆమె ఏమన్నారంటే...

► దశాబ్దాలుగా పలు పథకాల ద్వారా భారత దేశం సాధించిన సర్వతోముఖాభివృద్ధి, పౌరుల సృజనాత్మక ఆవిష్కరణల ఫలితంగా నేడు ప్రపంచం భారత్‌కు సమున్నత గౌరవం ఇస్తోంది.
► పలు దేశాల కూటములు, ప్రపంచ వేదికలపై మన జోక్యం తర్వాత దేశం పట్ల సానుకూలత పెరిగింది. ఫలితంగా దేశానికి అపార అవకాశాలు, నూతన బాధ్యతలు దక్కాయి.
► ఈ ఏడాదికి జీ20 కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా మెరుగైన ప్రపంచం, భవ్య భవిష్యత్తుకు బాటలు పరిచేందుకు భారత్‌కు సువర్ణావకాశం దొరికింది. భారత నాయకత్వంలో ప్రపంచం మరింత సుస్థిరాభివృద్ధి సాధించగలదని గట్టిగా నమ్ముతున్నా.
► ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు జీ20 దేశాల్లోనే ఉంది. ప్రపంచ జీడీపీకి 85 శాతం ఈ దేశాలే సమకూరుస్తున్నాయి. భూతాపం, పర్యావరణ పెను మార్పులుసహా పుడమి ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చలకు, పరిష్కారానికి జీ20 చక్కని వేదిక.
► దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఎక్కువగా ఆధారపడాల్సిన తరుణమొచ్చింది. సౌర, ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ సంబంధ విధాన నిర్ణయాలు అమలుచేస్తూ ఈ దిశగా వివిధ దేశాలకు భారత్‌ నాయకత్వ లక్షణాలను కనబరుస్తోంది. ఈ క్రమంలో సాంకేతికత బదిలీ, ఆర్థిక దన్నుతో సంపన్న దేశాలు ఆపన్న హస్తం అందించాలి.
► వివక్షాపూరిత పారిశ్రామికీకరణ విపత్తులను తెస్తుందని గాంధీజీ ఏనాడో చెప్పారు. సాంప్రదాయక జీవన విధానాల్లోని శాస్త్రీయతను అర్థంచేసుకుని పర్యావరణ అనుకూల అభివృద్దిని సాధించాలి.
► రాజ్యాంగ నిర్మాతలు చూపిన మార్గనిర్దేశక పథంలోని మనం బాధ్యతాయుతంగా నడవాలి. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నేతృత్వం వహించిన డాక్టర్‌ అంబేడ్కర్‌కు మనం సదా రుణపడి ఉండాలి. ఆ కమిటీలో 15 మంది మహిళలుసహా అన్ని మతాలు, వర్గాల వారికీ ప్రాధాన్యత దక్కడం విశేషం.
► దేశంలో నవతరం విడివిడిగా, ఐక్యంగానూ తమ పూర్తి శక్తిసామర్థ్యాలను సంతరించుకునే వాతావరణం ఉండాలి. దీనికి విద్యే అసలైన పునాది. 21వ శతాబ్ది సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) రూపొందించారు. విద్యా బోధనలో సాంకేతికతను లోతుగా, విస్తృతంగా వినియోగించాలని ఎన్‌ఈపీ స్పష్టంచేస్తోంది.

మరిన్ని వార్తలు