పశుగ్రాసం, ఎరువులుగా ఈకల వ్యర్థాలు

17 Sep, 2021 04:02 IST|Sakshi

కొత్త పద్ధతిని అభివృద్ధి చేసిన ముంబై ఐసీటీ

సాక్షి, న్యూఢిల్లీ: మానవ జుట్టు, ఉన్ని , పౌల్ట్రీ ఈకలవంటి కెరాటిన్‌ వ్యర్థాలను ఎరువులు, జంతువుల ఫీడ్‌లుగా తక్కువ ఖర్చులో మార్చేందుకు నూతన విధానాన్ని మన దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దేశంలో ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో మానవ జుట్టు, పౌల్ట్రీ ఈకల వ్యర్థాలు, ఉన్ని వ్యర్థాలు వెలువడతాయి. ఈ వ్యర్ధాలను డంప్‌ చేయడం, పాతిపెట్టడం, ల్యాండ్‌ఫిల్లింగ్‌ కోసం ఉపయోగించడం లేదా దహనం చేయడం ద్వారా పర్యావరణ ప్రమాదాలు, కాలుష్యం, ప్రజారోగ్యానికి ముప్పు, గ్రీన్‌హౌజ్‌ వాయు ఉద్గారాలు పెరుగుతున్నాయని గుర్తించారు.

అంతేగాక ఈ వ్యర్థాల్లో ఉన్న అమైనో ఆమ్లాలు, ప్రోటీన్‌ వంటి వనరులను జంతువుల దాణాతో పాటు ఎరువుగా ఉపయోగించగలిగే సామర్థ్యం ఉందని నిపుణులు తెలిపారు.  ముంబైకి చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఎ. బి.పండిట్‌ తన విద్యార్థులతో కలిసి, కెరాటిన్‌ వ్యర్థాలను పెంపుడు జంతువుల ఆహారంగా, మొక్కలకు ఎరువులుగా వాడే సాంకేతికతను అభివృద్ధి చేశారు. వ్యర్థాలను విక్రయించదగిన ఎరువులు, పశుగ్రాసంగా మార్చేందుకు వారు అధునాతన ఆక్సీకరణ విధానాన్ని ఉపయోగించారు.

>
మరిన్ని వార్తలు