400 ఏళ్ల క్రితం హత్య.. మిస్టరీని చేధించిన భారత శాస్త్రవేత్తలు

14 Jul, 2021 18:13 IST|Sakshi
జార్జియా రాణి కేతేవాన్‌ పెయింటింగ్‌(ఫోటో కర్టెసీ: అవుట్‌లుక్‌ ఇండియా.కామ్‌)

400 ఏల్ల క్రితం హత్య గావింపబడిన జార్జియా రాణి కేతేవాన్‌

భారతదేశంలో కేతేవాన్‌ అవశేషాలు

జూలై 9, 2021న రాణి అవశేషాలు జార్జియాకు అప్పగింత

సాక్షి, వెబ్‌డెస్క్‌: ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ క్రమంలో ఏ నేరం జరిగినా.. చిన్న క్లూతో మొత్తం క్రైమ్‌ సీన్‌ను కళ్లకు కడుతున్నారు పోలీసులు. అయితే టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందని కాలంలో జరిగిన ఎన్నో నేరాలకు సంబంధించిన వాస్తవాలు, రహస్యాలు అలానే నిశ్శబ్దంగా భూమిలో సమాధి అయ్యాయి. వీటిలో కొన్ని నేరాలు ఇప్పటికి కూడా పరిశోధకులను, శాస్త్రవేత్తలను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికత సాయంతో కాలగర్భంలో కలిసిపోయిన పలు రహస్యాలను చేధిస్తున్నారు శాస్త్రవేత్తలు. 

తాజాగా భారతీయ పురాతత్వ శాస్త్రవేత్తలు, పరమాణు జీవశాస్త్రవేత్తలు 400 ఏళ్ల నాటి మర్డర్‌ మిస్టరీని చేధించారు. ఇన్నాళ్లు రహస్యంగా మిగిలిపోయిన జార్జియా రాణి కేతేవాన్‌ మర్డర్‌ మిస్టరీని చేధించారు. ఆమెను గొంతు కోసి చంపారని మన పరిశోధకులు ధ్రువీకరించారు. పర్షియా చక్రవర్తి, షా అబ్బాస్ I జార్జియా రాణి సెయింట్ క్వీన్ కేతేవన్‌ను 1624 లో హత్య చేశాడా.. అంటే అవుననే అంటున్నాయి అందుబాటులో ఉన్న సాహిత్య ఆధారులు. 

అయితే, ఇరానియన్ కథనం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే వారు తమ దేశ చరిత్రలో అత్యంత ముఖ్య పాలకుల్లో షా అబ్బాస్ I ను ఒకడిగా భావిస్తారు. ఇలా భిన్న వైరుధ్యాలు ఉన్న ఈ మిస్టరీని మన శాస్త్రవేత్తలు పరిష్కరించారు. అసలు ఎక్కడో జార్జియాలో జరిగిన ఈ సంఘటనకు భారతదేశంతో సంబంధం ఏంటి.. దాన్ని మన శాస్త్రవేత్తలు పరిష్కరించడం ఏంటి వంటి తదితర వివరాలు తెలియాలంటే ఇది చదవాలి...

రాణి కేతేవాన్‌ కథ ఏంటంటే..
సాహిత్య ఆధారాల ప్రకారం 1613 లో పర్షియా చక్రవర్తి జార్జియన్ రాజ్యాన్ని జయించి, ఇరాన్ నైరుతిలో ఉన్న షిరాజ్ అనే నగరంలో రాణిని పదేళ్లపాటు బందీగా ఉంచాడని చెబుతున్నాయి. 1624 లో, కేతేవాన్‌ను మతం మారి, పర్షియా రాజు అంతపురంలో చేరవలసిందిగా చక్రవర్తి ఇచ్చిన ప్రతిపాదనను రాణి తిరస్కరించింది. ఈ క్రమంలో కేతేవాన్‌, పర్షియా రాజు చేతిలో తీవ్ర హింసకు గురైంది.

ఆమె మరణానికి ఒక సంవత్సరం ముందు, ఇద్దరు అగస్టీనియన్ పూజారులు ఒక మిషన్ ప్రారంభించడానికి షిరాజ్‌కు వచ్చారు. వారు రాణిని కలవడానికి అనుమతి పొందడమే కాక ఆమెకు సహాయకులుగా మారారు. ఈ క్రమంలో కేతేవాన్‌ మరణం తర్వాత పూజారులు ఆమె సమాధిని వెలికితీసి, రాణి అవశేషాలను 1624 నుంచి 1627 వరకు దాచారు. అనంతరం రాణి అవశేషాలను సురక్షితంగా ఉంచడానికి, వారు ఆమె శరీరంలోని వివిధ భాగాలను వేర్వేరు ప్రదేశాలలో దాచారు. 

గోవాలో రాణి కేతేవాన్‌ అవశేషాలు
ఈ క్రమంలో రాణి కేతేవాన్‌ కుడి చేయిని ఓల్డ్ గోవాలోని సెయింట్ అగస్టీనియన్ కాన్వెంట్‌కు తీసుకువెళ్లి అక్కడ సురక్షితంగా పూడ్చి పెట్టినట్లు సాహిత్య ఆధారాలున్నాయి. అంతేకాక వారు రాణి అవశేషాలను ఎక్కడెక్కడ పూడ్చిన విషయాలను కొన్ని పత్రాలలో స్పష్టంగా పేర్కొనన్నారు. దీనిలో ఓల్డ్‌ గోవా సెయింట్‌ అగస్టీనియస్‌ చర్చి ప్రస్తావన కూడా ఉంది. అయితే ఎప్పటికప్పుడు చర్చిని పునర్నిర్మించడంతో ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడం పెద్ద సవాలుగా ఉంది. మరోవైపు జార్జియా ప్రజలకు రాణి అవశేషాలు ముఖ్యమైనవి కాబట్టి, అప్పటి సోవియట్ యూనియన్ ప్రభుత్వం, ఆ తరువాత యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన తర్వాత జార్జియన్ ప్రభుత్వం, రాణి శేషాలను గుర్తించడంలో సహాయపడాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

ఈ శోధన 1980 ల చివరలో ప్రారంభమై.. అనేక విరమాలతో కొనసాగింది. చాలా ప్రయత్నాల తరువాత, స్థానిక చరిత్రకారులు, గోవా సర్కిల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)  పురావస్తు శాస్త్రవేత్తలు 2004 లో సాహిత్య వనరుల ఆధారంగా చర్చి గ్రౌండ్ మ్యాప్‌ను పునర్నిర్మించారు. ఈ క్రమంలో మొదట అక్కడ పూడ్చి పెట్టిన ఓ పొడవైన చేయి ఎముకను.. ఆ తరువాత మరో రెండు అవశేషాలను గుర్తించగలిగారు. 

22 వేల డీఎన్‌ఏలతో పోల్చారు
తాము గుర్తించిన అవశేషాల్లో క్వీన్ కేతేవన్‌కి సంబంధించిన వాటిని గుర్తించడం కోసం మూడు అవశేషాల మైటోకాన్డ్రియల్ డీఎన్‌ఏను వేరుచేశారు. దాన్ని సీసీఎంబీ డేటా బ్యాంక్‌లో 22,000 కంటే ఎక్కువ డీఎన్‌ఏ సీక్వెన్స్‌లతో సరిపోల్చారు. మొదట గుర్తించిన అవశేషం దేనితో సరిపోలేదు. మరోవైపు, తరువాత గుర్తించిన రెండు అవశేషాలు దక్షిణ ఆసియాలోని వివిధ జాతులతో ముఖ్యంగా భారతదేశంతో సరిపోలాయి. దాంతో మొదట తాము గుర్తించిన చేయిని రాణి కేతేవాన్‌ది ప్రకటించారు శాస్త్రవేత్తలు. 

ఈ విషయాలకు సంబంధించి ఎల్సెవియర్ జర్నల్‌లో 2014 లో తమ పరిశోధనా పత్రాన్ని కూడా ప్రచురించారు, అయితే రాణి అవశేషాలను జార్జియా ప్రభుత్వానికి అప్పగించే దౌత్య ప్రక్రియకు దాదాపు ఏడు సంవత్సరాలు పట్టింది. ఈ క్రమంలో 2021, జూలై 9 న, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జార్జియా విదేశాంగ మంత్రికి రాణి అవశేషాలను సమర్పించారు. దాంతో ఈ సంఘటనల చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. భారతీయ పరమాణు జీవశాస్త్రజ్ఞులు రాణి హత్యకు సంబంధించిన సాక్ష్యాల చారిత్రక ఆధారాలను కూడా ధృవీకరించారు. గొంతు కోసి రాణి కేతేవాన్‌ను హత్య చేసినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు