చైనా వక్రబుద్ధి: భారత జవాన్లకు గాయాలు

25 Jan, 2021 16:07 IST|Sakshi

గ్యాంగ్‌టక్‌: సందు దొరికితే చాలు భారత భూభాగంలో చొచ్చుకొచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది చైనా. కన్ను మూసి తెరిచేలోగా దొరికిన కాడికి దోచుకునేందుకు గుంటనక్కలా కాచుకుని కూర్చుంటుంది. భారత సైన్యం ఎన్నిసార్లు హెచ్చరించినా డ్రాగన్‌ ఆర్మీ తన వక్రబుద్ధిని పోనిచ్చుకోలేదు. తాజాగా చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అలర్ట్‌ అయిన భారత సైనికులు వారిని వెనక్కు వెళ్లగొట్టి డ్రాగన్‌ తోక ముడిచేలా చేశారు. గతవారం సిక్కింలోని నాకులా లోయలో సుమారు 20 మంది చైనా సైనికులు సరిహద్దు దాటి రహస్యంగా భారత్‌లోకి వచ్చేందుకు కుట్ర పన్నారు. వీరి ఎత్తుగడ అర్థమైన జవాన్లు వెంటనే వారిని వెళ్లిపొమ్మని హెచ్చరించారు. మాట చెవికెక్కించుకోని డ్రాగన్‌ ఆర్మీ ఆయుధాలు బయటకు తీసింది. (చదవండి: 63 సంవత్సరాల మహిళకు 43 ఏళ్ల జైలు శిక్ష..!)

ఈ క్రమంలో భారత్‌-చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ జరగ్గా సైనికులు ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. ఈ దాడిలో నలుగురు భారత జవాన్లు గాయాలపాలయ్యారు. పైగా అక్కడి వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ తీవ్రంగా పోరాడిన సైనికులు వారిని విజయవంతంగా వెనక్కు వెళ్లగొట్టారు. జనవరి 20న జరిగిన ఈ ఘర్షణ లోకల్‌ కమాండర్ల చర్చలతో సద్దుమణిగిందని ఇండియన్‌ ఆర్మీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా భారత్‌- చైనా ఆర్మీ అధికారులు సమావేశమైన మరుసటి రోజే ఈ ఘర్షణ జరగడం గమనార్హం. గతేడాది జూన్‌ 15న కూడా లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా మధ్య ఘర్షణ తలెత్తగా.. 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. (చదవండి: బలగాల మోహరింపు.. ఒప్పందానికి చైనా తూట్లు)

మరిన్ని వార్తలు