నా కుక్కపిల్ల లేకుండా ఉక్రెయిన్‌ విడిచి రాను!: భారతీయ విద్యార్థి

27 Feb, 2022 16:01 IST|Sakshi

Please Help Indian Student Stranded With Pet Dog: యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇంజినీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థి తన పెంపుడు కుక్క లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు నిరాకరించాడు.  తూర్పు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ రేడియో ఎలక్ట్రానిక్స్‌లో చదువుతున్న రిషబ్ కౌశిక్ విమానంలో తనతోపాటు కుక్కపిల్ల కూడా వచ్చేలా అన్ని అర్హత పత్రాలను సంపాదించేందుకు ప్రయత్నించానని చెప్పాడు.

మరిన్ని పత్రాల కోసం అధికారులను సంప్రదిస్తే వాళ్లు తనను కొట్టారని చెబుతున్నాడు. పైగా విమాన టికెట్టు అడుగుతున్నారని అన్నాడు. అయినా  ఉక్రెయిన్ గగనతలం మూసివేసినపుడు తాను విమాన టిక్కెట్‌ ఎలా పొందగలను అని ప్రశ్నిస్తున్నాడు. కౌశిక్ ఢిల్లీలోని భారత ప్రభుత్వ యానిమల్ క్వారంటైన్ సర్టిఫికేషన్ సర్వీస్ (ఏక్యూసీఎస్‌)ని, ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించానని కానీ ఎటువంటి ప్రయోజనం పొందలేకపోయానని చెప్పాడు.

ఢిల్లీలోని ఐజిఐ విమానాశ్రయంలో ఒకరికి కాల్ చేస్తే వారు తనని దుర్భాషలాడారని చెబుతున్నాడు. గత ఫిబ్రవరిలో ఖార్కివ్‌లో తనకు 'మాలిబు' అనే రెస్క్యూ కుక్కపిల్ల లభించిందని చెప్పాడు. కౌశిక్ రాజధాని కైవ్‌లోని ఒక బంకర్‌లో దాక్కున్నానని బాంబుల మోత, తుపాకుల మోతతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నానని అన్నాడు. "మీకు వీలైతే, దయచేసి మాకు సహాయం చేయండి. కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా మాకు సహాయం చేయడం లేదు. నాకు ఎవరి నుంచి ఎలాంటి అప్‌డేట్స్‌ లేవు " అని అతను భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.

(చదవండి: ఉక్రెయిన్‌ అధ్యక్షుడి నాటి డ్యాన్సింగ్‌ వీడియో!)

>
మరిన్ని వార్తలు