నక్షత్రాల అవిర్భావం గుట్టు విప్పిన భారత టెలిస్కోప్‌!

30 Nov, 2022 05:36 IST|Sakshi

న్యూఢిల్లీ:  బిగ్‌బ్యాంగ్‌ తర్వాత 20 కోట్ల ఏళ్లకు ఏర్పడ్డ తొలి నక్షత్రాల రహస్యాలను భారత టెలిస్కోప్‌ బహిర్గతం చేసింది. బెంగళూరులోని రామన్‌ పరిశోధనా సంస్థ (ఆర్‌ఆర్‌ఐ)లో డిజైన్‌ చేసి, నిర్మించిన సరస్‌–3 రేడియో టెలిస్కోప్‌తో నక్షత్రాల గుట్టును బయట పెట్టారు. 2020 మార్చిలో కర్ణాటకలోని దండిగనహళ్లి చెరువు వద్ద, కొంతకాలం శరావతి బ్యాంక్‌ వాటర్స్‌ వద్ద ఈ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేశారు.

విశ్వం ఎలా ఏర్పడిందో తెలుసుకొనేందుకు ఆర్‌ఆర్‌ఐతోపాటు ఆస్ట్రేలియాకు చెందిన కామన్‌వెల్త్‌ సైంటిఫిక్, ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (సీఎస్‌ఐఆర్‌ఓ), యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్‌ టెల్‌ అవివ్‌ పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించారు. సరస్‌–3 టెలిస్కోప్‌ డేటాను ఇటవలే విశ్లేషించారు. బిగ్‌బ్యాంగ్‌ అనంతరం తొలుత ఏర్పడిన నక్షత్ర మండలాల్లోని 3 కంటే తక్కువ శాతం వాయువులు నక్షత్రాలుగా రూపాంతరం చెందినట్లు గుర్తించామని ఆర్‌ఆర్‌ఐ ప్రతినిధి సౌరభ్‌ సింగ్‌ చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేసిన సరస్‌–3 రేడియో టెలిస్కోప్‌ కాస్మిక్‌ డాన్‌ ఆస్ట్రోఫిజిక్స్‌పై అవగాహన మరింత పెంచుకొనేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. బిగ్‌బ్యాంగ్‌ అనంతర కాలాన్ని కాస్మిక్‌ డాన్‌గా వ్యవహరిస్తారు. అప్పటి గెలాక్సీల్లో అత్యధిక సాంద్రత కలిగిన కృష్ణ బిలాలు (బ్లాక్‌ హోల్స్‌) ఉండేవి.

మరిన్ని వార్తలు