అమెరికా వెళ్లాలనుకునేవారికి శుభవార్త.. వెయిటింగ్ అక్కర్లే 14 రోజుల్లోనే వీసా!

5 Feb, 2023 19:17 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికా వీసా ఆశావహులు ప్రస్తుతం భారత్‌లో నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. బీ1, బీ2 వీసాల కోసం వేల మంది దరఖాస్తు చేస్తున్నారు. మొదటిసారి దరాఖాస్తుదారుల్లా అందరికీ ఇంటర్వ్యూ మినహాయింపు లేకపోవడంతో వీసా అపాయింట్‌మెంట్‌ కోసం ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సి వస్తోంది. 

అయితే  భారతీయుల కోసం ఈ సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తోంది అమెరికా. బ్యాంకాక్, సింగపూర్, థాయ్‌లాండ్‌, వియత్నాం దేశాల్లోని అమెరికా ఎంబసీలు భారతీయులు బీ1, బీ2 వీసాల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా రెండు మూడు వారాల్లోనే ప్రక్రియ పూర్తి చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితమే అమెరికా వీసా గడువు ముగిసిన భారతీయులు ఈ దేశాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే వీసా త్వరగా లభిస్తుంది. 

ప్రస్తుతం కోల్‍కతా నుంచి అమెరికా బీ1, బీ2 వీసాల కోసం ధరఖాస్తు చేస్తే ఇంటర్వ్యూ కోసం 589 రోజులు ఎదురు చూడాల్సి వస్తోంది. ముంబై నుంచి అయితే ఏకంగా 638 రోజులు వేచి చూడాలి. చెన్నైలో అయితే 609 రోజులు, హైదరాబాద్‌లో అయితే 596 రోజులు, ఢిల్లీలో అయితే 589 రోజులు వెయిట్ చేయాలి.  కానీ భారతీయులు బ్యాంకాక్ వెళ్లి అక్కడి  అమెరికా ఎంబసీ నుంచి వీసా కోసం దరఖాస్తు చేస్తే 14 రోజుల్లోనే ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తవుతుంది. వీసా త్వరగా రావాలనుకునే వారు ఈ దేశాలకు వెళ్తే సరిపోతుంది.

జనవరిలో తాము లక్ష వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ శనివారం వెల్లడించింది. 2019 జులై తర్వాత ఒక్క నెలలో ఇన్ని దరఖాస్తులు పరిశీలించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రానున్న రోజుల్లో సిబ్బంది పెరుగుతారు కాబట్టి ఇంకా ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేస్తామని పేర్కొంది.

కరోనా సమయంలో అమెరికా ఎంబసీలు వేల మంది సిబ్బందిని ఇంటికి పంపాయి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వారిలో కొంతమందిని మాత్రమే తిరిగి విధుల్లో చేర్చుకున్నాయి. ఈ కారణంగానే వీసాల జారీ ప్రక్రియ చాలా ఆలస్యమైంది. అయితే భారతీయుల కోసం అమెరికా కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. బీ1, బీ2 వీసాల కోసం తొలిసారి దరఖాస్తు చేసుకునేవారికి ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చింది.
చదవండి: డబ్బు ఉందా?.. దుబాయ్‌లో మంచి ఇల్లు.. బోలెడు రెంటు.. ఆపై గోల్డెన్ వీసా

మరిన్ని వార్తలు