భారతీయులు ఆత్మ విశ్వాసం కోల్పోరు

15 May, 2021 04:58 IST|Sakshi

కరోనాపై పోరాటంలో టీకా ఉత్తమ ఆయుధం

పీఎం కిసాన్‌ 8వ విడత నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ

అనంతపురం రైతు వెన్నూరమ్మకు ప్రధాని అభినందనలు 

కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల గడువు పొడిగిస్తామని వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత కఠిన పరిస్థితులు ఎదురైనా సరే భారతీయులు ఆత్మవిశ్వాసం కోల్పోరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ మేరకు సంపూర్ణ శక్తియుక్తులతోపాటు అకుంఠిత దీక్షతో కరోనా సవాలును అధిగమించగలరని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు సరైన అవగాహన కల్పించడంతోపాటు పారిశుద్ధ్యం, పరిశుభ్రత దిశగా పంచాయతీ పాలన మండళ్లు తగు చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీ కోరారు.

‘‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’’(పీఎం–కిసాన్‌) పథకం కింద ప్రధాని మోదీ శుక్రవారం 9.50 కోట్ల మందికి పైగా రైతులకు 8వ విడతగా రూ.20,667 కోట్లను విడుదల చేశారు. వర్చువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ పీఎం–కిసాన్‌ కింద ఇప్పటి వరకు 1.35 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని పలువురు రైతులతో కాసేపు ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో 170 మంది ఆదివాసీ రైతులకు వ్యవసాయంలో మార్గదర్శనం చేస్తున్న ఎన్‌.వెన్నూరమ్మ కృషిని ప్రధాని అభినందించారు.

‘‘ఈ పథకం కింద పశ్చిమ బెంగాల్‌ రైతులు 7.03 లక్షల మంది తొలిసారి లబ్ధి పొందనున్నారు. ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల్లో కూడా ఆహార ధాన్యాలు, ఉద్యాన పంటలను రికార్డు స్థాయిలో పండించిన రైతుల కృషి అభినందనీయం. వారికి శ్రమకు ఫలితం దక్కేవిధంగా ప్రభుత్వం కూడా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో పంటల కొనుగోళ్లలో ఏటా కొత్త రికార్డులు çసృష్టిస్తోంది. ‘ఎంఎస్‌పీ’తో ధాన్యం సేకరణలో కొత్త రికార్డు నెలకొనగా, గోధుమ కొనుగోళ్లు కూడా కొత్త రికార్డుల దిశగా సాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకూ ‘ఎంఎస్‌పీ’తో కొనుగోళ్లు 10 శాతం అదనంగా నమోదయ్యాయి.

వ్యవసాయంలో కొత్త సాధనాలు, సరికొత్త మార్గాలను రైతులకు చేరువ చేయడం కోసం ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కూడా ఇందులో భాగమే. కోవిడ్‌–19 మహమ్మారి సమయంలో ‘కిసాన్‌ క్రెడిట్‌ కార్డు’ల గడువును పొడిగించనున్నాం. తదనుగుణంగా వాయిదాల చెల్లింపు గడువును జూన్‌ 30దాకా పెంచే వీలుంటుంది. శతాబ్దానికోసారి దాపురించే మహమ్మారి మన కళ్లకు కనిపించని శత్రువులా నేడు ప్రపంచానికి సవాళ్లు విసురుతోంది. కోవిడ్‌–19 మహమ్మారిపై ప్రభుత్వం సర్వశక్తులూ కూడదీసుకుని పోరాడుతోంది.

ప్రజల కష్టాలు తీర్చడానికి భరోసా ఇస్తూ ప్రభుత్వంలోని అన్ని శాఖలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి’అని ప్రధాని తెలిపారు. కాగా, పశ్చిమబెంగాల్‌ రైతుల బ్యాంకు ఖాతాల్లో మొట్టమొదటి సారిగా పీఎం కిసాన్‌ నిధులు రూ.2 వేలు జమ అయ్యాయి. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ కేంద్రం, బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య విభేదాల కారణంగా ఆ రాష్ట్ర రైతులకు ఈ పథకం అమలు కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలను మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే.

అందరూ టీకా వేయించుకోండి
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విజృంభించడంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి 2.60 లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుందని తెలిపారు. వేగంగా కోవిడ్‌ టీకా వేసే దిశగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాయని ప్రధాని అన్నారు. ‘ప్రతి ఒక్కరూ పేరు నమోదు చేసుకుని, టీకా వేయించుకోవాలి. టీకా వేసిన తర్వాత కూడా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్‌ నియంత్రణ విధానాలను తప్పనిసరిగా కొనసాగించాలి. కరోనాపై పోరాటంలో ఈ టీకా అత్యంత కీలక ఆయుధం, దీనివల్ల తీవ్ర
ముప్పు తప్పుతుంది’’అని ప్రధాని తెలిపారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు