కొత్త పని సంస్కృతిని ఆస్వాదిస్తున్న ఉద్యోగులు!

11 Nov, 2021 10:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కారణంగా వచ్చిపడ్డ ‘వర్క్‌ ఫ్రం హోం’పద్ధతిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారు భారతీయ ఉద్యోగులు. విహార యాత్రలు చేస్తూనే ఆఫీసు పనులూ చక్కబెడుతున్నట్లు ఎయిర్‌ బీఎన్‌బీ నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి తెలిపింది.  యూగవ్‌ అనే సంస్థ గత నెల 12–19 మధ్య దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించింది. లాక్‌డౌన్‌ నిబంధనలు దాదాపుగా లేకపోవడం.. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను మళ్లీ ఆఫీసులకు రావాలని కోరకపోవడం వల్ల ఉద్యోగులు యాత్రలతో వినోదాన్ని పొందడమే కాకుండా.. ఉద్యోగాలను కూడా సమాంతరంగా చేసుకుంటున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. కరోనా మొదలైనప్పటి నుంచి ఉన్నట్లుగానే చాలామంది పర్యాటకులు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించేందుకు అంత సుముఖంగా లేరని తెలిపింది.
చదవండి: Purvanchal Expressway: విమానాలకు రన్‌వేగా..

పర్యాటకుల అవసరాలకు తగ్గట్టుగా తమ సేవల్లోనూ అనేక మార్పులు చేశామని ఎయిర్‌ బీఎన్‌బీ ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా ఆఫీసు పనులను బిజినెస్‌ అని వినోద, విహార యాత్రలను లీజర్‌ అని పిలుస్తూంటే... ఇప్పుడు ఈ రెండింటినీ కలిపిన కొత్త పని సంస్కృతిని ‘బ్లీజర్‌’అని పిలుస్తున్నట్లు ఎయిర్‌ బీఎన్‌బీ చెప్పింది. ఉద్యోగ, వ్యాపార నిమిత్తం చేసే యాత్రలను విహారానికీ ఉపయోగించుకుంటున్నట్లు 73 శాతం మంది తెలిపారంది. అలాగే 87 శాతం మంది ఆఫీసులు ఉన్న చోట కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి పనిచేసేందుకు లేదా ప్రయాణాలు జరుపుతూ పని చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. 

అతిథులకు ఆహ్వానం 
పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తమ ఇళ్లను అద్దెకు ఇచ్చేందుకు మాత్రమే కాకుండా.. పర్యాటకులకు అతిథి మర్యాదలు చేసేందుకు 44 శాతం మంది ఓకే అంటున్నారని ఎయిర్‌ బీఎన్‌బీ తెలిపింది. ఆతిథ్యం ఇచ్చే వారికి రక్షణ కల్పించేందుకు తాము ఎయిర్‌కవర్‌ పేరుతో బీమా ఇస్తున్నామంది. అతిథికి ఏమైనా నష్టం జరిగితే రూ.ఏడున్నర కోట్ల వరకూ పరిహారం ఇచ్చేందుకు ఇందులో ఏర్పాట్లు ఉన్నాయని వివరించింది. తద్వారా కొంత అదనపు ఆదాయం సమకూరుతుందని, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నది వారి అంచనా. పర్యాటకులకు, అతిథులకు మధ్య భాష సమస్య రాకుండా అత్యాధునిక ట్రాన్స్‌లేషనల్‌ ఇంజిన్‌ టెక్నాలజీని అందిస్తున్నామని కంపెనీ వెల్లడించింది. 

మరిన్ని వార్తలు