14 లక్షలు దాటిన పాజిటివ్‌ కేసులు

27 Jul, 2020 10:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 49,931 తాజా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో కరోనా పాజిటివ్‌ కేసులు ఈ స్ధాయిలో పెరగడం ఇదే తొలిసారి. తాజా కేసులతో భారత్‌లో కోవిడ్‌-19 కేసులు 14,35,453కు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 708 మరణాలు చోటుచేసుకోవడంతో కరోనా మరణాల సంఖ్య 32,771కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,85,114 యాక్టివ్‌ కేసులుండగా, వ్యాధి నుంచి 9,17,568 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 3,75,799 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా ఆదివారం 5,15,472 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,68,06,803 కరోనా పరీక్షలు నిర్వహించారని వెల్లడించింది. మరోవైపు కరోనా మహమ్మారిని నిరోధించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో జరుగుతున్న వ్యాక్సిన్‌ పరీక్షలు కీలక దశకు చేరాయి. మోడెర్నా వ్యాక్సిన్‌ అభివృద్ధికి అమెరికా రూ 7500 కోట్ల నిధులను సమకూర్చాలని నిర్ణయించింది. చదవండి : వచ్చే ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్‌

మరిన్ని వార్తలు