Covid Cases in India: 2 కోట్లు దాటిన కరోనా కేసులు

5 May, 2021 02:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గత 24 గంటల్లో 3,57,229 కొత్త పాజిటివ్‌ కేసులు 

ఒక్కరోజులో 3,449 మంది మృతి 

రికార్డుస్థాయిలో గత 24 గంటల్లో కోలుకున్న 3,20,289 మంది రోగులు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా నమోదవుతోన్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్తంత తగ్గింది. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 3,57,229 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా సంక్రమించిన వారి సంఖ్య మొత్తంగా 2,02,82,833కు పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కేసులున్న రెండో దేశంగా భారత్‌ కొనసాగుతోంది.

భారత్‌లో సంక్రమణ వేగం చాలా వేగంగా ఉంది. కేవలం 137 రోజుల్లో కరోనా సంక్రమణ కేసులు ఒక కోటి నుంచి రెండు కోట్లకు చేరుకున్నాయి. అంటే నాలుగు నెలల్లో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి. అంతకుముందు వైరస్‌ సోకిన వారి సంఖ్య లక్ష నుంచి ఒక కోటికి చేరుకోవడానికి 360 రోజులు పట్టింది. అదే సమయంలో 3,449 మంది మరణించారు. వరుసగా ఏడు రోజులుగా 3 వేల మంది రోగులకు పైగా ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం వారంలో గణాంకాలను చూస్తే, ఈ వారంలో మరణాల సంఖ్య 41% పెరిగింది. ఈ సమయంలో 24,514 మంది రోగులు మరణించారు. ప్రపంచంలోని టాప్‌–10 దేశాలతో పోలిస్తే, భారత్‌తోపాటు టర్కీ, అర్జెంటీనా, జర్మనీ, కొలంబియా తదితర దేశాల్లో మరణాల సంఖ్య పెరిగింది. అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇరాన్‌ వంటి మిగతా దేశాల్లో గత వారంతో పోలిస్తే ప్రస్తుతం కొత్త కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. అయితే గత 24 గంటల్లో కరోనా నుండి కోలుకున్న రోగుల సంఖ్య 3 లక్షల 20 వేల 289 గా ఉంది. ఇది దేశంలో మారుతున్న పరిస్థితులకు అద్దంపడుతోంది. దీంతో దేశంలో ఇప్పటివరకు 1 కోటి 66 లక్షల 13 వేల 292 మంది కోలుకున్నారు.

దేశంలో కోవిడ్‌  సంబంధ గణాంకాలు 
గత 24 గంటల్లో కొత్త కేసులు: 3,57,229 
10 రాష్ట్రాల్లోనే 71% కొత్త కేసులు
మొత్తం మరణాలు: 3,449 
గత 24 గంటల్లో కోలుకున్న రోగులు: 3,20,289  
గత 24 గంటల్లో చేసిన కరోనా టెస్ట్‌లు: 16,63,742 
దేశంలో పాజిటివిటీ రేటు: 21.47% 
యాక్టివ్‌ కేసుల సంఖ్య: 34,47,133 
ఇప్పటివరకు వైరస్‌ సోకిన వారి సంఖ్య:  2,02,82,833 
కోలుకున్న వారు: 1,66,13,292  
రికవరీ రేటు:  81.19%   ∙మొత్తం మరణాలు: 2,22,408 
వ్యాక్సిన్‌ డోస్‌లు: 15,89,32,921   

మరిన్ని వార్తలు