పెరిగిన గ్రామీణ నిరుద్యోగం

4 Nov, 2020 11:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పంటల కోతల సీజన్‌ ఊపందుకుంటున్నా గ్రామీణ నిరుద్యోగ శాతం మాత్రం క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సెప్టెంబర్‌లో 5.86 శాతమున్న ఉపాధి లేమి, నిరుద్యోగం అక్టోబర్‌ నెలాఖరుకు 6.9 శాతానికి పెరిగింది. జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద సెప్టెంబర్‌తో పోల్చితే అక్టోబర్‌లో పనిదినాలు తగ్గడమూ నిరుద్యోగం పెరుగుదలకు కారణం కావొచ్చని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తెలిపింది. నరేగా కింద సెప్టెంబర్‌లో 26.5 కోట్ల పనిదినాలు కల్పించగా... అక్టోబర్‌లో 17.3 కోట్ల పనిదినాలకు తగ్గిపోయాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.

‘ప్రస్తుతం పంట కోతలు మొదలైనందున అది కొంతమేర లేబర్‌ మార్కెట్‌ను ఆకర్షించే అవకాశమున్నా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సీజన్‌ ఇంకా పూర్తిస్థాయిలో పుంజుకోలేదు. తమ వృత్తి నైపుణ్యాలు, చేయగలిగే పనికి తగ్గట్టు పనులు దొరక కపోవడమూ నిరుద్యోగం పెరగడానికి కారణం కావొచ్చు’ అని ఆర్థికవేత్తలు అనూప్‌ మిత్ర, కేఆర్‌ శ్యాంసుందర్‌ చెబుతున్నారు. జాతీయ స్థాయిలో నిరుద్యోగ శాతం (గ్రామీణ, పట్టణాల్లో కలిపి) సెప్టెంబర్‌లో 6.67 నుంచి అక్టోబర్‌లో 6.98కి చేరుకుంది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పట్టణాల్లో నిరుద్యోగ శాతం సెప్టెంబర్‌లో 8.45 నుంచి అక్టోబర్‌లో 7.15కి తగ్గింది.

మరిన్ని వార్తలు