IndiGo Airlines: 'క్యూట్‌'గా ఉంటే విమాన టికెట్‌పై అదనపు ఛార్జ్‌.. ఇందులో నిజమెంత? 

11 Jul, 2022 16:21 IST|Sakshi

దిల్లీ: విమాన టికెట్‌లోనే ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ ఫీ, యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీ అంటూ వివిధ రకాల ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే.. ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించిన వారు తమ టికెట్‌లో 'క్యూట్‌ ఛార్జ్‌' అంటూ కనిపించటంపై ఆశ్చర్యానికి గురయ్యారు. అందంపై రుసుము వసూలు చేయటమేంటని తికమకపడ్డారు. శాంతాను అనే వ్యక్తి తన టికెట్‌ వివరాలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. 'క్యూట్‌ ఛార్జ్‌' వివరాలతో కూడిన ఆ టికెట్‌ వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు దీనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇండిగో సంస్థపై విమర్శలు గుప్పించారు. 'నా వయసుతో నేను చాలా అందంగా కనిపిస్తానని తెలుసు. కానీ దానికి నాపై ఇండిగో ఇలా ఛార్జ్‌ వసూలు చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు' అని పేర్కొన్నారు. 

శాంతాను షేర్‌ చేసిన చిత్రంలో టికెట్‌ ధరకు సంబంధించిన వివరాలను ఉంచారు. అందులో ఎయిర్‌ఫేర్‌ ఛార్జీలు, సీట్‌ ఫీ, సెక్యూరిటీ, కన్వీనియన్స్‌ ఫీజులతో పాటు క్యూట్‌ ఛార్జ్‌ అంటూ రూ.100 వసూలు చేశారు. ఇలాంటి ఫోటోనే మరో వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. 'ఈ కొత్త ఛార్జీల కారణంగానే నేను ఇండిగోలో ప్రయాణించాలనుకోవట్లేదు. ఆ ఛార్జీలు నాకు రూ.20వేలు అవుతుంది. విమానం టికెట్‌ ధర కన్నా అది చాలా ఎక్కువ' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  

క్యూట్‌ ఫీ అంటే ఏమిటి?
క్యూట్‌ అంటే 'కామన్‌ యూజర్‌ టెర్మినల్‌ ఈక్వీప్‌మెంట్‌' అని అర్థం. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఈ ఛార్జీలు వసూలు చేస్తుంది. ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో మెటల్‌ డిటెక్టింగ్‌ మిషన్లు, ఎస్కలేటర్లు, ఇతర సామగ్రిని ఉపయోగిస్తున్నందుకు దీనిని వసూలు చేస్తారు. ట్విట్టర్‌లో క్యూట్‌ ఫీపై వైరల్‌గా మారిన క్రమంలో ఇండిగో సమాధానమిచ్చింది.'ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో కామన్‌ యూజర్‌ టెర్మినల్‌ ఈక్వీప్‌మెంట్‌(క్యూట్) సేవలను ఉపయోగిస్తున్నందుకు ఈ ఛార్జీలను వసూలు చేస్తారని తెలుసుకోండి. మీకు సేవ చేసేందుకే మేము ఉన్నాం' అని ఓ నెటిజన్‌కు సమాధానమిచ్చింది.

ఇదీ చదవండి: 10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలోమీటర్లు నడిచి 'హజ్‌' యాత్ర

మరిన్ని వార్తలు