ఇండిగో విమానానికి తప్పిన భారీ ప్రమాదం

3 Apr, 2021 14:01 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: లక్నో నుండి బెంగళూరుకు వస్తున్న ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ల్యాండిగ్‌కు కొన్ని క్షణాల ముందు క్యాబిన్ డిప్రెజరైజేషన్‌కు గురి కావడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే పైలట్‌, సిబ్బంది అప్రమత్తతతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అధికారులు, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

తాజా నివేదికల ప్రకారం ఇండిగో విమానం బెంగళూరుకు 240 కిలోమీటర్ల దూరంలో, 11,000 అడుగుల ఎత్తులో ఉండగా ఇండిగో ఫ్లైట్ 6ఈ-6654 క్యాబిన్‌లో ఇబ్బంది ఎదురైంది. దీంతో విమాన సిబ్బంది అత్యవసర ప్రమాద సంకేతం మేడేను ప్రకటించారు. తక్షణమే ప్రయాణీకులకు ఆక్సిజన్‌ మాస్క్‌లు అందించారు. అనంతరం బెంగళూరు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి విమాన లాండింగ్‌ క్లియరెన్స్ కోరారు. వారి అనుమతి మేరకు విమానాన్ని సురకక్షితంగా ల్యాండ్‌ చేయడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ విమానాన్ని బెంగళూరు సాంకేతిక బృందం తనిఖీ చేస్తోంది. అలాగే ఈ అంశంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు చేస్తోంది. 

క్యాబిన్ డిప్రెషరైజేషన్ ఇబ్బంది ఏర్పడితే అత్యవసర పరిస్థితిని తెలియజేస్తూ...‘మేడే’ లేదా ‘పాన్ పాన్’ అనే ప్రమాద సంకేతాన్నివ్వాలి. సంబంధిత ఏటీసీ అధికారుల అనుమతితో ల్యాండ్‌కావాలి. ప్రయాణీకులందరికీ ఆక్సిజన్‌ మాస్క్‌లు అందజేయాలి. కాగా గత ఏడాది మే నెలలో పాకిస్తాన్‌లోని క‌రాచీ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ల్యాండ్ అవ్వడానికి ఒక్క నిమిషం ముందు మేడే మేడే సందేశం ఇస్తూనే.. విమానం కుప్పకూలిన ప్రమాదంలో 97 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు