ఇందిర చేసిన తప్పే రాజీవ్‌ను బలి తీసుకుందా?

12 Nov, 2022 21:06 IST|Sakshi

రాజీవ్ హత్య కేసులో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టడానికి సిట్ నానా తిప్పలు పడింది. 1991 జూన్ 11న మొదటి అరెస్టు జరిగింది. 1991 నవంబర్ నాటికి నిందితుల వేటను ముగించింది. దొరికిన అన్ని డాక్యుమెంట్లు, వీడియో క్యాసెట్లు, ఫోటోలు, ఫైళ్లు అన్నింటినీ పరిశీలించి LTTE చీఫ్ ప్రభాకరన్ సహా 41 మందిని నిందితులుగా చూపుతూ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 1998 జనవరి 28న నిందితులందరికీ మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. 

శ్రీలంకలో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో తమిళులు ఉండేవారు. ఈలమ్ పేరుతో వేరే దేశాన్ని ఏర్పాటు చేయాలనేది వీరి డిమాండ్. వీరికి తమిళ రాజకీయ పార్టీలు సహా తమిళుల అండ దండలు కూడా ఉండేవి. శ్రీలంక తమిళుల్లో.. కొందరు మితవాదులు, మరికొంతమంది అతివాదులు ఉండేవారు. సింహళీయ తమిళులకు ప్రభుత్వం కొన్ని హక్కులిచ్చి, ప్రజలకు రక్షణ కల్పించాలని మిత వాదులు భావిస్తే ఈలమ్ ఏర్పడి తీరాల్సిందేనని అతివాదులు చెప్పేవారు. ఈలం కోసం హింసా మార్గాలు అనుసరించినా తప్పులేదని భావించేవారు. ఈ క్రమంలోనే.. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం LTTE పురుడుపోసుకుంది. 

1954లో పుట్టిన వేలుపిళ్లై ప్రభాకరన్ 1976 మే 5న LTTEని ఏర్పాటు చేశాడు. తన 21వ ఏట.. జాఫ్నా మేయర్‌ను హత్య చేసి అలజడి సృష్టించిన ప్రభాకరన్.. తమిళ ఈలం ఏర్పాటు డిమాండ్‌తో లంకలో హింసాత్మక పద్దతులకు పాల్పడ్డాడు. శ్రీలంక నాయకులు కూడా తమిళుల ఓట్ల కోసం నానా రకాల ఎత్తులు వేశారు. ఆ ఆటలో నాటి భారత ప్రభుత్వం కూడా పాలు పంచుకుందనే ఆరోపణలున్నాయి. లంక సర్కార్‌ను ఇరుకునపెట్టడానికి ఇందిరాగాంధీ హయాంలో LTTEని ప్రోత్సహించారని చెబుతారు. టైగర్లకు ఆయుధాలు, నిధులు అందించారని అంటారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు DMK, అన్నాడీఎంకే సహా తమిళ పార్టీలన్నీ ఈ వ్యవహారంలో తలో చేయి వేశాయి. 

లంక సర్కార్‌పై పోరు ప్రకటించిన ప్రభాకరన్ 1983-86 మధ్య తమిళనాడులో తలదాచుకున్నాడు. ఆ సమయంలో తమిళనాడు సీఎం MGR కాగా ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నారు. ఇందిర మరణం తర్వాత లంక విషయంలో భారత సర్కార్‌ వైఖరి మారింది. ప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌గాంధీ టైగర్ల విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించారు. ఈ క్రమంలో 1986 నవంబర్‌లో తమిళ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా గాలింపులు జరిపి LTTE ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకరన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రభాకరన్ నిరాహార దీక్ష చేపట్టాడు. అతనికి మద్ధతుగా DMK సహా తమిళ నేతలు ఆందోళనలు చేశారు. గత్యంతరం లేని పరిస్థితిలో ప్రభుత్వం టైగర్ల ఆయుధాలను తిరిగిచ్చేసింది. ఆ పరిణామం LTTE ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రెట్టించిన ఉత్సాహంతో శ్రీలంకతో పాటు భారత్‌లోనూ LTTE పలు హింసాత్మక చర్యలకు పాల్పడింది. LTTE దాడులను అరికట్టడానికి రాజీవ్‌గాంధీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక ప్రభుత్వంతో రాజీ పడాలంటూ.. ప్రభాకరన్‌కు రాజీవ్ సూచించారు. అవసరమైతే ఈ సంధి వ్యవహారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పారు. 

ఈ క్రమంలో రాజీవ్ గాంధీ, శ్రీలంక ప్రధాని జయవర్దనే మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో శాంతిని నెలకొల్పడానికి భారత్‌ నుంచి శాంతి పరిరక్షక బృందాలు రంగంలోకి దిగాయి. ఆ బలగాలు.. LTTE మూకలను చీల్చి చెండాడాయి. ఇది LTTEకి ఊపిరిసలపనివ్వలేదు. 1991లో భారత్‌లో మళ్లీ ఎన్నికలొచ్చే సరికి LTTE భయపడిపోయింది. రాజీవ్‌గాంధీ మళ్లీ ప్రధాని ఐతే తమ ఆటలు సాగబోవని ఆందోళన చెందింది. రాజీవ్ ఉంటే తమకు ముప్పు తప్పదని భావించిన LTTE అతన్ని హతమార్చేందుకు కుట్ర పన్నింది. 

రాజీవ్‌గాంధీని చంపాలని ప్రభాకరన్ నిర్ణయం తీసుకోవడానికి ఇదొక్కటే కారణం కాదు. 1991 మార్చి ఐదో తేదీన జరిగిన ఓ మీటింగ్‌ ప్రభాకరన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 1991 మార్చి ఐదో తేదీన LTTE కేంద్ర కమిటీ సభ్యుడు కాశీ ఆనందన్.. శ్రీలంక సమస్య గురించి రాజీవ్‌గాంధీతో రహస్యంగా చర్చలు జరిపాడు. ఐతే కాశీ వచ్చింది రాజీవ్‌ను చంపడానికి. రాజీవ్‌ను ఢిల్లీలోనే హతమార్చే ప్లాన్‌తో LTTE.. కాశీని ఢిల్లీ పంపించింది. అయితే, రాజీవ్‌తో భేటీ తర్వాత కాశీ తన నిర్ణయం మార్చుకున్నాడు. లంక తమిళుల పట్ల రాజీవ్‌కు సానుభూతి ఉందని, అతనితో సత్సంబంధాలు పెట్టుకోవడం LTTEకి మంచిదంటూ ప్రభాకరన్‌కు కాశీ లేఖ రాశాడు. ఇది ప్రభాకరన్‌కు మంట పుట్టించింది. చంపి రమ్మని పంపితే హితోక్తులు చెబుతున్నాడంటూ రగిలిపోయిన ప్రభాకరన్.. అప్పుడే రాజీవ్ హత్యకు ప్రణాళిక రచించాడు. 

ఎంత పకడ్బంధీగా చేసినా నేరస్థులు ఎక్కడో చోట చిన్న తప్పు చేస్తారు. ఆ చిన్న పొరపాటే వారిని పోలీసులకు పట్టిస్తుంది. రాజీవ్ హత్య కేసులోనూ అదే జరిగింది. అత్యంత పకడ్బంధీ ప్లాన్‌తో రాజీవ్‌ హత్య చేశామని చంకలు గుద్దుకున్న LTTEకి కొన్ని రోజుల్లోనే షాక్ తగిలింది. రోజుల వ్యవధిలోనే టైగర్ల కుట్ర బయటపడింది. ఓ రసీదు.. ఓ కెమెరా.. నేరస్థుల ఆనవాళ్లను పట్టించాయి. ఆ దర్యాప్తు క్రమంలోనే రాజీవ్ హత్యకు LTTE ఎలా ప్లాన్ వేసిందో బయటపడింది. 

రాజీవ్‌ను హత్య చేసే పనిని ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి పొట్టు అమ్మన్‌కు అప్పగించింది. అసలు పేరు షణ్ముగలింగం శివశంకర్. 1962లో పుట్టిన అమ్మన్ 1981లో LTTEలో చేరాడు. స్వల్ప కాలంలోనే LTTEలో కీలక నేతగా ఎదిగిన అమ్మన్‌కు ఎవరిని ఏ పనికి ఉపయోగించుకోవాలో బాగా తెలుసంటారు. దాంతో.. ప్రభాకరన్‌కు అమ్మన్‌పై నమ్మకం ఎక్కువ. అందుకే రాజీవ్‌ను హతమార్చే పనిని అమ్మన్‌కు అప్పగించాడు. ఈ క్రమంలో రాజీవ్‌ను హత్య చేసే పథకం ఊపిరి పోసుకుంది. 

ప్రభాకరన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పొట్టు అమ్మన్.. 1991 ఏప్రిల్ 28న జాఫ్నాలోని మధకల్‌లో ఓ సమావేశం ఏర్పాటు చేశాడు. అంటే రాజీవ్ హత్యకు దాదాపు మూడు వారాల ముందు ఈ మీటింగ్ జరిగింది. శివరాజన్, ధాను, శుభ, రూసో, కీర్తి, శివరూపన్, విజయానందన్, నెహ్రూ, సుధేంద్రరాజా, అఖిల తదితరులు ఆ మీటింగ్‌లో పాల్గొన్నారు. రాజీవ్‌ను చంపకపోతే లంకలో తమిళులు శాంతంగా ఉండలేరని, రాజీవ్ బతికి ఉంటే తమకు ముప్పు తప్పదంటూ శివరాజన్, ధాను తదితరులకు నూరి పోశాడు. అలా రాజీవ్ హత్యకు హంతకముఠాను ప్రిపేర్ చేశాడు. 

శివరాజన్.. రాజీవ్ హంతక ముఠాకు లీడర్ ఇతనే. ఇతని అసలు పేరు భాగ్యచంద్రన్. రాజన్, దురై, అరవింద్, శివరాజ్ ఇలా చాలా మారు పేర్లే ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన శివరాజన్.. 1983లో అతివాద సంస్థలతో పరిచయం పెంచుకొని పేలుడు పదార్థాల తయారీలో గట్టి శిక్షణ తీసుకున్నాడు. 1984లో LTTEలో చేరాడు. శ్రీలంకలో భారత శాంతి పరిరక్షణదళానికి సహకరిస్తున్న EPRLF నేత పద్మనాభన్‌ను హత్యచేసింది ఇతనే. దాంతో పొట్టుఅమ్మన్‌కు శివరాజన్‌పై గట్టి నమ్మకం ఏర్పడింది. పద్మనాభన్‌ను చంపిన ఏడాదికే.. రాజీవ్‌ను హతమార్చే బాధ్యతను శివరాజన్‌పై పెట్టాడు. ఆ బాధ్యతను తీసుకున్న శివరాజన్ ముందుగా తన జట్టును తయారు చేసుకున్నాడు. 

పద్మనాభన్‌ హత్యలో సహకరించిన సుధేంద్ర రాజాను తీసుకున్నాడు. ఇతనికి రాజా, శాంతన్ అనే మారు పేర్లు ఉన్నాయి. అతనితో పాటు శుభ అనే అమ్మాయి వచ్చింది. ఈమె LTTE షాడో బృందం సభ్యురాలు. ఇక మానవబాంబుగా ధాను ఎంపికైంది. 22 ఏళ్ల ధాను అసలు పేరు కళైవాణి. ముద్దు పేరు అన్బు. బట్టికలోవాలో పాఠశాల విద్య పూర్తి చేసిన ఆమె తండ్రి సూచనలతో LTTEలోని మహిళా విభాగం కరుంపులిలో చేరింది. ఇక రూసో, విజయానందన్‌లు హంతకముఠాతో చేయి కలిపారు. వీరితో పాటు మరో ముఖ్య వ్యక్తి శివ రూపన్. ఇతను పొట్టు అమ్మన్‌కు నమ్మకస్తుడైన వ్యక్తిగత వైర్‌లెస్ ఆపరేటర్. LTTEలో రహస్యాలు తెలిసిన అతి కీలక వ్యక్తుల్లో శివరూపన్ కూడా ఒకడు. ఇక ముఠాలో మరో ఇద్దరు సభ్యులు నెహ్రూ, తంబి అన్న. ఇలా హతమార్చడానికి శివరాజన్ నేతృత్వంలో 9 మంది సభ్యులతో ముఠా తయారైంది.

శివరాసన్ చెప్పిన ప్రకారం నడుచుకోవాలని ధాను, తదితరులకు పొట్టు అమ్మన్ స్పష్టంగా చెప్పాడు. దీంతో శివరాసన్ సూచనల ప్రకారం ఏప్రిల్ 30న హంతక ముఠా శ్రీలంకలోని మధకల్‌ నుంచి  నాటు పడవలో బయల్దేరి మే ఒకటో తేదీన తమిళనాడులోని వేదారణ్యం దగ్గర కొడికరల్ తీరానికి చేరారు. స్మగ్లర్ షణ్ముగం వారిని సురక్షిత స్థావరాలకు తరలించాడు. LTTE రాజకీయ విభాగంలో పని చేస్తూ మద్రాస్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాంతన్‌, డిక్సన్‌లు కూడా వారితో చేరిపోయారు. 

హంతకముఠా వేదారణ్యంలో అడుగుపెట్టేనాటికి  LTTE మద్రాస్‌లో పూర్తి స్కెచ్‌తో రెడీ ఐంది. చెన్నైలో LTTE కార్యకలాపాలకు కేంద్రమైన శుభా న్యూస్ అండ్ ఫోటో ఏజెన్సీస్ యజమాని శుభా సుందరం అందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. LTTE సిద్ధాంతవేత్తల్లో ముఖ్యుడైన బేబీ సుబ్రమణీయం అలియాస్ బాల సుబ్రమణ్యంతో పాటు శివరాజన్ సహాయకుడు మురుగన్‌లు కలిసి.. కుట్రదారులను తయారు చేశారు. ముత్తు రాజన్ తదితరులు వారికి సహరించారు. శుభా సుందరం, సుబ్రమణ్యం, మురుగన్‌లు కలిసి ఫోటో గ్రాఫర్ హరిబాబు, అరివు పెరారీ వాలన్, నళిని, ఆమె తమ్ముడు భాగ్యనాధన్‌లను తమ కుట్రలో పావులుగా చేసుకున్నారు. 

ధాను మానవబాంబు.. ఆమెకు స్టాండ్‌ బైగా మరో మానవబాంబు శుభ. ఐతే నళినితో ప్రేమలో పడిన మురుగన్.. ఆమెను కూడా మానవబాంబుగా మార్చాలని ప్రయత్నించాడు. అందుకు రంగం కూడా సిద్ధం చేశాడు. ఐతే స్టాండ్ బై మానవ బాంబుగా శుభ రావడంతో ప్లాన్ మార్చేశాడు. ఇక పెరారీ వాలన్ బెల్టు బాంబును తయారు చేశాడు. అలా రాజీవ్ హత్యకు రంగం సిద్ధమైంది. రాజీవ్‌ను హతమార్చాలని కంకణం కట్టుకున్న LTTE.. అందుకు రిహార్సల్స్ చేసుకుంది. ఏప్రిల్ 21న రాజీవ్‌గాంధీ పాల్గొన్న ఎన్నికల ప్రచారంలో రిహార్సల్స్ జరిపి చూసుకున్నారు. ఆ తర్వాత మే 7న వీపీ సింగ్ సభలోనూ రిహార్సల్స్ చేసుకున్నారు. ఓ వీఐపీ వద్దకు వెళ్లి మానవబాంబు ప్రయోగించగలమో లేదో చెక్ చేసుకున్నారు. మే 7 నుంచి 20 వరకు హత్యకు సంబంధించి వివిధ రకాల పనులు పూర్తి చేసుకున్నారు. ఇక అనుకున్న రోజు రానే వచ్చింది. మే 20 తేదీ రాత్రి కుట్రదారులు ఎంజాయ్ చేశారు. 

1991 మే 21.. జయకుమార్ ఇంట్లో శివరాజన్ రెడీ అయ్యాడు. మానవబాంబు ధాను, శుభాలతో కలసి నళిని ఇంటికి వెళ్లాడు. ఫోటోగ్రాఫర్ హరిబాబు పారిస్ కార్నర్‌కు వెళ్లి పూంపుహార్ అనే షో రూమ్‌లో ఒక చందనమాల కొన్నాడు. ధాను, శుభ, నళిని, హరిబాబు, మురుగన్‌లను తీసుకొని శివరాజన్‌ శ్రీ పెరంబుదూర్ బయల్దేరాడు. 21 సాయంత్రం ఏడున్నర గంటలకు.. హంతకముఠా శ్రీ పెరంబుదూర్ చేరింది.  మే 20న ఒడిశాలో ప్రచారం చేసిన రాజీవ్ 21న ఉదయం ఒడిశాలోని భద్రక్, అంగుల్, పర్లాఖిమిడి, గుణపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పర్యటించాడు. 

ధాను ధరించిన బెల్ట్‌బాంబుకు 2 స్విచ్‌లున్నాయి. ఒకటి సేఫ్టీ స్విచ్ కాగా మరొకటి బాంబ్‌ను పేల్చే స్విచ్. రాజీవ్‌కు పాదాభివందనం చేసే నెపంతో కిందికి వంగిన ధాను.. మొదట సేఫ్టీ స్విచ్ నొక్కి శివ రాజన్‌కు సైగ చేసింది. శివరాజన్ తప్పుకోగానే మరో మాట లేకుండా రెండో స్విచ్ నొక్కేసింది. అంతే 10.25 ప్రాంతంలో అక్కడ మారణహోమం జరిగిపోయింది. కన్నుమూసి కన్ను తెరిచేంతలో కనివినీ ఎరుగని దారుణ హత్య జరిగిపోయింది. హంతకముఠాకు లీడర్‌గా వ్యవహరించిన శివరాజన్ సూసైడ్ చేసుకున్నాడు. అతనికి సహకరించిన స్మగ్లర్ షణ్ముగం.. సిట్ విచారణ జరుగుతుండగానే విచిత్ర పరిస్థితుల్లో చనిపోయాడు. మిగత వాళ్లు పోలీసులకు దొరికిపోయారు.

మరిన్ని వార్తలు