వైరల్‌ వీడియో.. కూరగాయల మార్కెట్‌లో ఇంగ్లీష్‌లో నిరసన

23 Jul, 2020 21:07 IST|Sakshi

భోపాల్‌: ఇండోర్‌లోని ఓ కూరగాయల మార్కెట్‌లో మున్సిపల్‌ అధికారుల చర్యలకు వ్యతిరేకంగా ఓ యువతి నిరసన తెలుపుతోంది. చుట్టు ఉన్నవారు ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు. నిరసన తెలిపితే ఆశ్చర్యం పోవడం ఎందుకు అనుకుంటున్నారా.. కారణం ఉంది. ఆమె స్పష్టమైన ఇంగ్లీష్‌లో నిరసన తెలుపుతుండటంతో చుట్టు ఉన్న వారు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. వివరాలు.. రైసా అన్సారీ అనే యువతి ఇండోర్‌లోని దేవి అహల్య యూనివర్సిటీ నుంచి మెటిరియల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసింది. కానీ ఉద్యోగం లభించలేదు. ఇదిలా ఉండగానే.. కరోనా వచ్చి పరిస్థితులను మరింత దిగజార్చింది. (ఆ కథనంపై చలించిన సోనూసూద్‌)

ఈ క్రమంలో సదరు యువతి కుటుంబానికి తోడుగా ఉండాలని భావించింది. దాంతో ఓ తోపుడు బండి మీద కూరగాయలు, పండ్లు అమ్మడం ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. గురువారం మున్సిపల్‌ అధికారలు వచ్చి.. రోడ్డు పక్కన ఉన్న తోపుడు బండ్లను తొలగించాల్సిందిగా ఆదేశించారు. దాంతో అన్సారీ మిగితావారితో కలిసి మున్సిపల్‌ అధికారుల చర్యలకు వ్యతిరేకంగా నిరసనకు దిగింది. అధికారులు తమను ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో స్పష్టమైన ఇంగ్లీష్‌లో తెలిపింది. ఈ సదర్భంగా అన్సారీ మాట్లాడుతూ.. ‘ఓ పక్క మార్కెట్‌ను క్లోజ్‌ చేశారు. కూరగాయలు కొనడానికి ఎవరూ రావడం లేదు. ఇక్కడ నేను, నా కుటుంబ సభ్యులు, స్నేహితులం 20 మంది దాకా ఇలా తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకుంటున్నాం. కానీ అధికారులు వచ్చి బండ్లను తొలగించమంటున్నారు. మరి మేం ఏం తిని బతకాలి’ అని ప్రశ్నించారు.
(రాఖీలు అమ్ముకుంటున్న సీరియ‌ల్ న‌టి)

ఇంతలో కొందరు ‘ఇంగ్లీష్‌ బాగా మాట్లాడుతున్నారు.. ఏం చదివారు’ అని అన్సారీని అడిగితే పీహెచ్‌డీ చేశానని చెప్పారు. ‘మరి ఉద్యోగం చేయవచ్చుగా’ అని అడిగితే.. నా పేరు చూసి ఎవరు నాకు ఉద్యోగం ఇవ్వడం లేదని వాపోయారు. ప్రస్తుం ఈ వీడియో తెగ వైరలవుతోంది. 
 

మరిన్ని వార్తలు