రుణ బాగోతం.. ఏం జరిగిందో తెలియాలి..

16 Jul, 2021 07:12 IST|Sakshi
ఇంద్రజిత్‌ లంకేశ్‌, నటుడు దర్శన్‌

నటుడు దర్శన్‌పై ఇంద్రజిత్‌ లంకేశ్‌ ఫైర్

 హోంమంత్రికి ఫిర్యాదు  

యశవంతపుర: నటుడు దర్శన్‌పై ప్రముఖ నిర్మాత– దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేశ్‌ యుద్ధానికి నాంది పలికారు. దర్శన్‌ పేరుతో నకిలీ పత్రాలతో రూ.25 కోట్ల అప్పు తీసుకోవడానికి కొందరు యత్నించడంపై ఏం జరిగిందో కూపీ లాగాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హోంమంత్రి బసవరాజ బొమ్మైకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో  పూర్తి విచారణ జరపాలని మైసూరు పోలీసు కమిషనర్‌ను ఆదేశించినట్లు హోంమంత్రి  గురువారం బెంగళూరులో తెలిపారు. ఈ కేసులో నిర్మాత ఇంద్రజిత్‌ లంకేశ్‌ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేస్తారన్నారు.

అంత త్వరగా రాజీనా: లంకేశ్‌..  
మైసూరులో సందేశ్‌ ప్రిన్స్‌ హోటల్‌లో సప్లయర్‌పై నటుడు దర్శన్‌ దాడి చేశారని, అతని కంటికి గాయమైందని నిర్మాత ఇంద్రజిత్‌ లంకేశ్‌ ఆరోపించారు. అతనికి రూ.50 వేలు ఇచ్చి రాజీ అయ్యారన్నారు. కాగా రూ.25 కోట్ల లోన్‌ కేసులో ఆరోపణలున్న అరుణకుమారిని దర్శన్‌ ఫాంహౌస్‌కు ఎందుకు పిలిచారు. అంత త్వరగా ఎందుకు రాజీ అయ్యారని ఇంద్రజిత్‌ ప్రశ్నించారు. వీటన్నింటిపై విచారణ చేయాలని హోంమంత్రికి ఫిర్యాదు చేశానన్నారు. కాగా, గతంలో శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో కూడా లంకేశ్‌ అనేకమందిపై ఆరోపణలు చేయడం, సీఐడీ విచారణకు వెళ్లడం తెలిసిందే.

అదృశ్య శక్తుల పని: దర్శన్‌..  
ఈ వ్యవహారాలపై దర్శన్‌ స్పందిస్తూ, హోటల్‌లో గలాటా జరగడం నిజమే, అయితే సప్లయర్‌పై దాడి చేయలేదని, ఇంద్రజిత్‌ ఆరోపణలు సరికాదని అన్నారు. ఇక లోన్‌ విషయంలో కొన్ని అదృశ్య శక్తులు పని చేశాయని ఆరోపించారు.

హోటల్లో దర్శన్‌ గొడవ నిజమే
మైసూరు: మైసూరులోని తమ ప్రిన్స్‌ హోటల్లో నటుడు దర్శన్‌ గొడవ చేయడం నిజమే. నేనే పిలిచి మందలించానని నిర్మాత సందేష్‌నాగరాజు కుమారుడు సందేష్‌ చెప్పారు. గురువారం ఆయన హోటల్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. దర్శన్‌ సుమారు 20 మంది స్నేహితులతో సుమారు నెలరోజుల కింద రాత్రి 11 గంటలప్పుడు వచ్చారు. మా వెయిటర్‌తో గొడవ పడ్డారు, కానీ అతన్ని కొట్టలేదు. నేను వెళ్లి సర్దిచెప్పా అని తెలిపారు.    

మరిన్ని వార్తలు