ఆప్‌ ఎంపీపై సిరా దాడి

6 Oct, 2020 02:13 IST|Sakshi

హాథ్రస్‌లో ఘటన; ఖండించిన కేజ్రీవాల్‌

హాథ్రస్‌/లక్నో:  ఆమ్‌ ఆద్మీ పార్టీ పార్లమెంటు సభ్యుడు సంజయ్‌ సింగ్‌పై హాథ్రస్‌లో సోమవారం ఒక వ్యక్తి సిరా పోసి నిరసన తెలిపాడు. హాథ్రస్‌ హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి వెళ్తున్న సంజయ్‌ సింగ్‌పై గుర్తు తెలియని వ్యక్తి సిరా పోశాడు.  ‘పీఎఫ్‌ఐ దళారి.. వెనక్కు వెళ్లిపో’ అని అతడు గట్టిగా అరిచాడు. అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను ఢిల్లీ సీఎం  కేజ్రీవాల్‌ ఖండించారు. యూపీ ప్రభుత్వ తీరుకు ఇది అద్దం పడుతుందని వ్యాఖ్యానించారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలకు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) నిధులిచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి.  

దేశద్రోహం కేసు: కుల ఘర్షణలకు ప్రయత్నిస్తున్నారని, కులం ప్రాతిపదికన విద్వేషం రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు  కేసు నమోదు చేశారు. చాంద్‌పా పోలీస్‌స్టేషన్‌లో వారిపై దేశద్రోహం సహా పలు తీవ్ర అభియోగాలు మోపారు. హత్యాచారానికి గురైన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాజకీయ, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఈ కేసు నమోదు కావడం గమనార్హం. ఇలా ఉండగా, బాధిత దళిత యువతి ఇంటి వద్ద సెక్యూరిటీ పెట్టామని, ఆమె ఇద్దరు సోదరులకు ఇద్దరు గన్‌మెన్లను ఏర్పాటు చేశామని ఓ అధికారి చెప్పారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు