డ్రగ్స్‌పై గురి 

30 Aug, 2020 07:02 IST|Sakshi

శాండల్‌వుడ్‌లో దందా మీద విచారణ

నటీమణులకే ఎక్కువగా సరఫరా

విచారణలో తెలిపిన విక్రేతలు

త్వరలో నోటీసులు జారీ

యశవంతపుర: డ్రగ్స్‌ దందాకు సంబంధించి మత్తు పదార్థాల నియంత్రణ దళం (ఎన్‌సీబీ) అధికారులు నటులు, సంగీత దర్శకులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. వీటి మధ్య పాత్రికేయుడు ఇంద్రజిత్‌ లంకేశ్‌ తనకు రక్షణ కల్పిస్తే సినిమా రంగానికి చెందిన ముఖ్యల పేర్లను బయటపెడతానని ప్రకటించడం శాండల్‌వుడ్‌లో ప్రకంపనలు కలిగిస్తోంది. డ్రగ్స్‌ కేసులో విచారణ తప్పదని బెంగళూరు పోలీసు కమిషనర్‌ కమల్‌ పంథ్‌ తెలిపారు.  

కొన్నేళ్లుగా డ్రగ్స్‌ సరఫరా 
గత గురువారం డ్రగ్స్‌ డీలర్లు అనికా, అనూప్, రాజేశ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారించగా ఆసక్తికర వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్ల నుంచి పలువురు నటీ–నటులకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. టీవీ రియాలీటీ షో కళాకారులు, డ్యాన్సర్లు కూడా డ్రగ్స్‌ వాడేవారని, నటీమణులు ఎక్కువగా మత్తు పదార్థాలను కొనేవారని చెప్పినట్లు వెల్లడి. సౌందర్య పోషణ కోసం నటీమణులు డ్రగ్స్‌ను ఉపయోగించేవారని తెలిపారు. సినిమా విడుదలైన వెంటనే నటీనటులు, యూనిట్‌ సిబ్బంది నగరంలో పేరుమోసిన హోటల్స్, పబ్‌లకు వెళ్లి పార్టీలు చేసుకునేవారు. లాక్‌డౌన్‌ సమయంలో అనికా డ్రగ్స్‌ను కోరినచోటికి సరఫరా చేసేవారు.  

ఇంద్రజిత్‌ లంకేశ్‌కు పిలుపు  
నటీనటులు ఎక్కడ డ్రగ్స్‌ తీసుకొనేవారో వెళ్లడిస్తానని పాత్రికేయుడు ఇంద్రజిత్‌ లంకేశ్‌ చెబుతున్నారు. ఎన్‌సీబీ విచారణకు పూర్తిగా సహకరిస్తామని పోలీసు కమిషనర్‌ కమల్‌ పంథ్‌ తెలిపారు. కేసును తమకు అప్పగించిన కేసును విచారిస్తామని అయన తెలిపారు. ఇంద్రజిత్‌ ప్రకటనపై దృష్టి పెట్టామన్నారు. విచారణకు రావాలని లంకేశ్‌కు శనివారం నోటీసులు పంపినట్లు చెప్పారు.

విద్యాసంస్థలూ పారాహుషార్‌ 
బనశంకరి: పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమైన తరువాత మాదకద్రవ్యాల దుష్పరిణామాల పట్ల జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తాం, కాలేజీలు, హాస్టళ్లలో డ్రగ్స్‌ దొరికితే సంబంధిత విద్యాసంస్థలనే బాధ్యులుగా చేసి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి బసవరాజబొమ్మై తెలిపారు. శనివారం హావేరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీసీబీ పోలీసులు పెద్దమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారని, మాదకద్రవ్యాల ముఠా గురించి కీలక సమాచారం తెలిసిందన్నారు. విదేశీయుల పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది, ఆ ముఠాలను కూకటి వేళ్లతో పెకలిస్తామన్నారు. – హోంమంత్రి 

మరిన్ని వార్తలు