మనసున్న రాజేశ్వరి 

31 Aug, 2020 06:40 IST|Sakshi
సుకన్యకు సారె అందజేస్తున్న రాజేశ్వరి

అంధురాలికి 16 రకాల వస్తువులతో సారె 

మరోమారు మానవీయత చాటుకున్న ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి

సాక్షి, చెన్నై: చెన్నైలో పనిచేస్తున్న మహిళా ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి మనసున్న మహిళగా మరోమారు నిరూపించుకున్నారు. తన వద్దకు వచ్చి మొరపెట్టుకున్న చూపు లేని ఓ యువతికి వివాహం నిమిత్తం 16 రకాల వస్తువులతో సారెను అందించి మానవీయతను చాటుకున్నారు. చెన్నై సెక్రటేరియెట్‌ కాలనీ పోలీసుస్టేషన్‌లో రాజేశ్వరి సీఐగా పనిచేస్తున్నారు. కరోనా కాలంలో ఈమె సేవలు అభినందనీయం. రోడ్డుపై అనాథగా పడి ఉన్న వృద్ధురాలి మృతదేహానికి అన్నీతానై అంత్యక్రియలు సైతం జరిపించారు. సాయం అంటూ తన వద్దకు ఎవరైనా వస్తే చేతనైనంత సహకారం అందిస్తున్నారు. ఈపరిస్థితుల్లో తన పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్న చూపు లేని (అంధురాలు) సుకన్య వారం రోజుల క్రితం రాజేశ్వరిని కలిశారు. తన తల్లిదండ్రులు ఎప్పుడో మరణించారని, తాను, తన సోదరి ప్రీతి పిన్ని సురేఖ పర్యవేక్షణలో ఉన్నట్టు పేర్కొన్నారు. చిన్నాన్న కూలి పనులు చేస్తున్నాడని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నట్టు వివరించారు. 

16 రకాల వస్తువులతో సారె .... 
తనకు కోయంబత్తూరుకు చెందిన యువకుడితో  సెప్టెంబర్‌ 4న పెరంబలూరులో వివాహం జరగనున్నట్టు పేర్కొన్నారు. తన వివాహానికి ఏదేని నగదు సాయం చేయాలని సుకన్య విజ్ఞప్తి చేసుకుంది. అయితే, తాను వివాహానికి పెద్దగా సాయం చేయలేనంటూ ఇన్‌స్పెక్టర్‌ తొలుత నిరాకరించారు. ఒట్టి చేత్తో సుకన్య పోలీసుస్టేషన్‌ నుంచి వెనుదిరిగింది. శుక్రవారం ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరికి సుకన్య ఫోన్‌ చేసి కనీసం చిన్న ముక్కు పుడక లేదా, చెవిదిద్దులైనా సాయం చేయాలని కోరింది. దీంతో సుకన్య చెబుతున్నది వాస్తవమేనా అని రాజేశ్వరి ఆరా తీయడంతో ఆమె పేదరికం వెలుగు చూసింది.

దీంతో ఒక్క ముక్కుపుడక ఏమిటి, చెవి దిద్దులు, వెండిపట్టీలు, బీరువా, మంచం, పట్టు చీర పాటుగా మరికొన్ని చీరలు, ఫ్యాన్, మిక్సీ, గ్రైండర్, వాటర్‌ హీటర్‌ అంటూ ఇంటి సామన్లతో 16 రకాల సారెను తన వంతుగా రాజేశ్వరి కొనుగోలు చేసి ఇవ్వడానికి నిర్ణయించారు. శనివారం రాత్రి తన స్టేషన్‌కు సుకన్యను పిలిపించారు. ఈ సమాచారంతో ఆ పరిసర వాసులు సైతం ఆస్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ సుకన్యను కొత్త పెళ్లి కూతుర్ని చేసినట్టుగా పట్టు చీర కట్టించి, పూలమాల వేసి , తన వంతుగా ఆ సారెను అందించి మనస్సున్న రాజేశ్వరిగా అందరి మదిలో ఈ మహిళా ఇన్‌స్పెక్టర్‌ ముద్ర వేసుకున్నారు.  ఇన్‌స్పెక్టర్‌ ఆశీర్వాదం తీసుకున్న సుకన్య ఆనందానికి అవధులు లేదు. పుట్టింటి సారెగా రాజేశ్వరి ఇచ్చిన కానుకకు తోడుగా ఆ కాలనీ వాసులు పలువురు ముందుకు వచ్చి తమ వంతు సాయానికి సిద్ధమయ్యారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా